కాల్‌మనీ వ్యాపారులకు... ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |

విజయనగరం జిల్లాలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను అధిక వడ్డీ రేట్లతో వేధిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు

కాల్‌మనీ వ్యాపారులకు... ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో కాల్‌మనీ వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలను అధిక వడ్డీ రేట్లతో వేధిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. కాల్‌మనీ పేరుతో సాధారణ ప్రజలను మోసం చేయడం, అధిక వడ్డీ వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని బెదిరించడం, ఇచ్చిన అప్పుకంటే అధికంగా వసూలు చేస్తూ ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో కొంతమంది వేరే జిల్లా వ్యక్తులు విజయనగరం జిల్లాకు వచ్చి అవసరాల్లో ఉన్న ప్రజలను గుర్తించి వారికి అప్పులు ఇచ్చి, అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తూ వారిని ఆర్థికంగా మరియు మానసికంగా వేధిస్తూ వ్యాపారం చేస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వీరు ప్రజల అవసరాలకు డబ్బులు ఇచ్చి వారి నుండి బ్లాంక్ ప్రామిసరీ నోటు, బాండ్ పేపర్, తెల్లకాగితం మీద సంతకాలు తీసుకోని వాటిని కోల్కతా, బిహార్ వంటి బయట రాష్ట్రాల న్యాయస్థానాలలో వేసి ప్రజలను న్యాయస్థానాలకు రప్పించి, వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నారన్నారు. ఇలాంటి కాల్‌మనీ వ్యాపారం వల్ల పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. కాల్‌మనీ వ్యాపారం నిర్వహించే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి, వారి ఆస్తులను జప్తుచేయటం జరుగుతుందని, వారి పై రౌడీ షీటులు తెరవబదతాయని, అవసరమైతే ఇటువంటి కేసులను స్వచ్ఛంద దర్యాప్తు సంస్థలైనటువంటి సి.బి.ఐ., ఈ.డి., సిట్ కు దర్యాప్తు కోసం బదిలీ చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరికైనా కాల్‌మనీ ద్వారా వేధింపులు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో కాని, డయిల్ 100/112కు కాని ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.

ప్రజలకు విజ్ఞప్తి

ప్రజలు అవసరాల కోసం కాల్‌మనీ వ్యక్తులను ఆశ్రయించకుండా బ్యాంకులు, సహకార సంఘాలు వంటి చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలను మాత్రమే సంప్రదించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే ఎవరైనా అధిక వడ్డీతో అప్పులు ఇస్తూ వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల భద్రత మరియు సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, అక్రమ కార్యకలాపాలను సహించబోమని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story