మంచినీళ్లు ఇవ్వడంలో ఆలస్యం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!

by Ramesh Naini |

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

మంచినీళ్లు ఇవ్వడంలో ఆలస్యం.. తల్లిని కొట్టి చంపిన కొడుకు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఫ్రిజ్‌లోని మంచినీళ్లు తీసుకురావడంలో ఆలస్యం జరిగిందనే ఆగ్రహంతో ఓ యువకుడు తన తల్లిపై దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. గ్రామానికి చెందిన రాజబాబు అనే వ్యక్తి, తన తల్లి పెంటా నాగమణి (45)ని ఫ్రిజ్‌లోని నీళ్లు తీసుకురావాలని కోరినట్లు సమాచారం. అయితే నీళ్లు తీసుకురావడంలో ఆలస్యం కావడంతో ఆగ్రహానికి లోనైన రాజబాబు, ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో పూజా గదిలో ఉన్న చెక్కబల్లకు నాగమణి తలను బలంగా బాదినట్లు తెలుస్తోంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన నాగమణి రక్తస్రావంతో స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కాకినాడ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి (జీజీహెచ్)కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రాజబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, తల్లిపై కుమారుడు దాడి చేసి ప్రాణాలు తీసిన ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story