భార్యకు బలవంతపు అబార్షన్లు.. పేరుకే సద్గుణ.. అన్నీ దుర్గుణాలే!

by Naga Rani Yarlagadda |

లక్షల రూపాయల కట్నం, కోట్లు విలువచేసే భూమి, తులాల కొద్దీ బంగారం.. అన్నీ తీసుకుని పెళ్లిచేసుకున్నాక భర్త నిజస్వరూపం బయటపడింది.

భార్యకు బలవంతపు అబార్షన్లు.. పేరుకే సద్గుణ.. అన్నీ దుర్గుణాలే!
X

దిశ, వెబ్ డెస్క్: కెనడాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. పైగా మేనమామ కొడుకు. ఇంకేముంది వెనకాముందు ఆలోచించకుండా లక్షల రూపాయల కట్నం, కోట్లు విలువచేసే ల్యాండ్, అడిగినంత బంగారం, ఇంకా పెట్టిపోతలు చాలానే పెట్టి మరీ పెళ్లిచేశారు. సీన్ కట్ చేస్తే ఏడాది లోపే భార్యకు రెండుసార్లు అబార్షన్ చేయించి పుట్టింటి వదిలేసి కెనడాకు పరారయ్యాడు భర్త. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన ఉజ్జయినికి - తన మేనమామ కొడుకు అయిన కర్రి సద్గుణకు గతేడాది మే8వ తేదీన పెద్దలు వివాహం చేశారు. పేరుకే సద్గుణ.. అతనిలో ఉన్నవన్నీ దుర్గుణాలే. బాగా చూసుకుంటాడని రూ.30 లక్షల కట్నం, 40 తులాల బంగారం, కోట్లు విలువచేసే ఎకరం భూమి, ఇంకా చాలానే కట్నం కింద ముట్టజెప్పారు. పెళ్లయ్యాక మూడునెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఉజ్జయిని గర్భవతి అయింది. విషయం తెలిసి ఎగిరి గంతేయాల్సింది పోయి.. బెదిరించి అబార్షన్ చేయించాడు ఆ కర్కోటక భర్త. కొద్దిరోజులకే తనతోపాటే కెనడాకు తీసుకెళ్లాడు. అక్కడైనా సరిగ్గా చూసుకున్నాడా అంటే లేదు. కొద్దిరోజులు మురిపించి.. ఆ తర్వాత తనలోని రాక్షసుడిని చూపించాడు. అతని ఫోన్ ముట్టుకుంటే ఊరుకునేవాడు కాదు. వేరే అమ్మాయిలతో చాటింగ్ ఏంటని ప్రశ్నిస్తే కొట్టేవాడు. తన పేరెంట్స్ చెప్పాలని ఫోన్ చేస్తే.. దానిని కూడా లాగేసుకుని ఒక రూమ్ లో నిర్బంధించాడు. ఉజ్జయిని మళ్లీ ప్రెగ్నెంట్ అవ్వగా.. ఆమె ఆరోగ్యం క్షీణించింది. అబార్షన్ చేయించి పుట్టింట్లో వదిలేసి కెనడాకు పారిపోయాడు.

తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ఈ విషయంలో వారు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని బాధితురాలి తల్లిదండ్రులు వాపోతున్నారు. భర్త మోసం చేసాడని ఫిర్యాదు చేస్తే రివర్స్ లో తమకే చుక్కలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కౌన్సెలింగ్ పేరుతో దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ కాలయాపన చేస్తున్నారంటున్నారు. మరోవైపు సద్గుణ తండ్రి నాగేశ్వరరావు.. తన కోడలి మానసిక పరిస్థితి బాలేదని, అందుకే విడాకుల నోటీసు పంపామని చెప్తున్నారు. రెండుసార్లు అబార్షన్, గృహహింస చేసిన భర్తపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్షల కట్నం, బంగారం, కోట్లు విలువచేసే భూమి తీసుకుని పెళ్లి చేసుకుని.. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్న దుర్మార్గుడిపై కఠిన చర్యలు బాధితురాలైన ఉజ్జయిని డిమాండ్ చేస్తోంది.

Next Story