- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతం
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ కోర్టులో మెమో దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్తగా చేర్చిన 11 మంది నిందితులలో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఉద్యోగులు కావడం గమనార్హం. మిగిలిన వారు నెయ్యి సరఫరాకు సంబంధించిన డెయిరీ నిపుణులుగా సిట్ గుర్తించింది.
2019 నుంచి 2024 మధ్య కాలంలో టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన ఉన్నతాధికారులతో పాటు ఇతర సిబ్బందిపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. గతంలో జనరల్ మేనేజర్‌లుగా (కొనుగోళ్లు) పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణలపై సిట్ కేసు నమోదు చేసింది. ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రమణ్యం (ఇతను గతంలోనే అరెస్టయ్యారు) తో కలిసి వీరు కూడా ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిపైనా తాజాగా సిట్ కేసు నమోదు చేసింది. జీఎంలతో పాటు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న మరికొందరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కూడా కేసు నమోదైంది. డెయిరీల ప్లాంట్లను తనిఖీ చేసి, కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు అనుకూలంగా నివేదికలు ఇచ్చిన ఐదుగురు బయటి డెయిరీ నిపుణులను కూడా నిందితులుగా చేర్చినట్లు సిట్ కోర్టుకు సమర్పించిన మెమోలో పేర్కొంది.
కల్తీ నెయ్యి కుంభకోణం నేపథ్యం
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి అవసరమైన నెయ్యి కొనుగోలులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. 2019-24 మధ్య దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయిందని సిట్ విచారణలో తేలింది. ఈ కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించడం వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. టీటీడీ అధికారులు, సిబ్బంది సరఫరాదారులైన భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగా డెయిరీల ప్రతినిధులతో కుమ్మక్కయ్యారని సిట్ గుర్తించింది. లంచాలు తీసుకుని, తప్పుడు పత్రాలను ధృవీకరించి, కల్తీ నెయ్యి సరఫరాకు అనుమతిచ్చారని సిట్ దర్యాప్తులో తేటతెల్లం అయ్యింది. నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ నివేదికలు వచ్చినా, కొనుగోళ్ల విభాగం అధికారులు వాటిని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని కూడా సిట్ వెల్లడించింది. సిట్ దర్యాప్తు వేగవంతం కావడంతో, ఈ కల్తీ నెయ్యి కేసులో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.






