TTD:శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు.. ఎప్పటి నుంచంటే?

by Jakkula.Mamatha |

శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు తేదీలను టీటీడీ తాజాగా ప్రకటించింది

TTD:శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు.. ఎప్పటి నుంచంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు తేదీలను టీటీడీ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో ఎల్లుండి(మే 17) నుంచి 19వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల(మే) 18న సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

అనంతరం ఉత్సవర్ల‌ను ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయ నాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు.

చివరి రోజు.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చ‌కులు తెలిపారు. ఈ సందర్భంగా మే 17 నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో కల్యాణోత్సవం ఆర్జిత సేవను టీటీడీ(TTD) రద్దు చేసింది.

Next Story