వైసీపీలో మౌన రాగం: ఏబీఎన్ వివాదంలో కీలక నేతలు సైలెంట్!

by Naga Rani Yarlagadda |

వైసీపీలో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఎందుకు ఈ మౌనం? వీరంతా సైలెంట్ గా తప్పుకుంటారా?

వైసీపీలో మౌన రాగం: ఏబీఎన్ వివాదంలో కీలక నేతలు సైలెంట్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. వీకెండ్ కామెంట్ లో వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆ పార్టీ నేతలు ఈ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇందుకు వైసీపీ నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన చేశారు. అది ఉద్రిక్తతతు దారితీయడంతో పలువురు నేతలు అరెస్టు కూడా అయ్యారు. అసలు విషయం ఏంటంటే.. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని వైసీపీలో కొందరు నేతలు మాత్రమే ఖండించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, ఆర్కే రోజా, వరుదు కళ్యాణి, కల్పలత రెడ్డి రాధాకృష్ణ తీరును తప్పుపట్టారు. కానీ.. వైసీపీలోనే కీలకంగా ఉన్న కొందరు నేతలు మాత్రం ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ నోరు విప్పలేదు.

వైసీపీ పనైపోయిందా?

వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన కొందరు దీనిపై స్పందించలేదు. మహిళా మంత్రులుగా పనిచేసిన విడదల రజిని, తానేటి వనిత, కీలక నేతలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారు ఏబీఎన్ రాధాకృష్ణ కామెంట్స్ పై స్పందించకపోవడం కొత్తఅనుమానాలతు తావిస్తోంది. వైసీపీ అంటే మేము.. మేము అంటే వైసీపీ అన్నంతలా తిరిగిన నేతలంతా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా విడదల రజిని, తానేటి వనిత పార్టీలోనే ఉన్నా.. పార్టీకి సంబంధించిన అంశాలపై పెదవి విప్పకపోవడం గమనార్హం. దీంతో వారి నియోజకవర్గాల్లో వైసీపీ పనైపోయిందా అన్న చర్చ జరుగుతోంది.

ఆ స్ట్రాటజిస్టులు నోరుమెదపరేం?

సాధారణంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే కొడాలి నాని.. ఈ ఇష్యూలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ స్ట్రాటజీలను నిర్దేశించే సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ వివాదానికి దూరంగా ఉండటం వెనుక రాజకీయ అంతరార్థం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, నాయకుడిపై వ్యక్తిగత దాడులు జరుగుతున్నప్పుడు స్పందించని వారు.. ఇక పార్టీలో ఉన్నట్లేనా? అని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కొందరైతే ఈ నేతలు భవిష్యత్తులో వేరే పార్టీల వైపు చూస్తున్నారా? అందుకే ఏబీఎన్ వంటి మీడియా సంస్థలతో వైరం పెట్టుకోవడం ఇష్టం లేక సైలెంట్ అయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అంబటి రాంబాబు వంటి వారు జైలుకెళ్లడానికైనా సిద్ధమని రోడ్డెక్కుతుంటే, మరోవైపు కీలక నేతల మౌనం వైసీపీలో ముసలం పుట్టిస్తోంది.

మౌనం వెనుక మర్మమేంటి?

మాజీ మహిళా మంత్రులు విడదల రజిని, తానేటి వనిత సాటి మహిళల గౌరవం గురించి జరుగుతున్న ఈ పోరాటంలో కనీసం X వేదికగా కూడా స్పందించకపోవడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. నిన్నటి వరకు మైక్ దొరికితే చాలు విరుచుకుపడే కొడాలి నాని, ఈ వివాదం మొదలైనప్పటి నుంచి ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. వీరు పార్టీలో ఉన్నా.. లేనట్టుగానే వ్యవహరిస్తున్నారని, అసలు వైసీపీకి భవిష్యత్తు ఉందా? అనే చర్చ వీరి మౌనం వల్ల మరింత బలపడుతోంది.

పదవి ఉంటేనే పోరాటం.. అధికారం పోతే అజ్ఞాతం

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ మేకతోటి సుచరిత, తానేటి వనిత వంటి వారు హోం మంత్రులుగా పనిచేశారు. విడదల రజిని, రోజా వంటి వారు కీలక శాఖలను ఏలారు. అప్పట్లో ప్రతిపక్ష నేతలు చిన్న మాట అన్నా, గంటల తరబడి మీడియా ముందు కూర్చుని కౌంటర్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పదవులు లేని కారణంగా వారు మౌన వ్రతం పూనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీని వెనకుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వ్యూహకర్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. "మేము జగనన్న సైనికులం" అని చెప్పుకునే నేతలు, అధికారం పోగానే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా జంకుతున్నారు. తమ నియోజకవర్గాల్లో పట్టు కోల్పోయిన ఈ నేతలు, ఇప్పుడు ఏబీఎన్ వంటి పెద్ద మీడియా సంస్థలతో పెట్టుకుంటే తమ మిగిలిన రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని భయపడుతున్నారా? అన్న అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ సీనియర్ నేతల తీరు చూస్తుంటే.. ఏబీఎన్ రాధాకృష్ణకు మద్దతు పలికినట్టే కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు. రాధాకృష్ణతో ఉన్న చనువు, ఇతర వ్యాపార అనుబంధాలతో లాలూచి పడి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

Next Story