సభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే రాజీనామా చెయ్.. జగన్‌పై రెచ్చిపోయిన షర్మిల

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

సభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే రాజీనామా చెయ్.. జగన్‌పై రెచ్చిపోయిన షర్మిల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆమె స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘గవర్నర్ బడ్జెట్ ప్రసంగం అంతా డొల్ల. రాష్ట్ర అభివృద్ధిపై దశ - దిశ లేదు. అంతా అవాస్తవాలు.. కల్పితాలు. ఎన్నికల మేనిఫెస్టోకు మెరుగులద్ది చదివినట్లుంది. 19 నెలల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం. పాలన తీరుపై గవర్నర్‌తో చెప్పించినవి పచ్చి అబద్ధాలు. పునర్:నిర్మాణం పేరుతో ఇంకా పబ్బం గడపడం తప్పా ప్రసంగంలో కొత్తదనం లేదు. కూటమి ప్రభుత్వానికి విజన్ లేదు.. విజ్డం లేదు. సుపరిపాలన లేదు.. సమతూకం అంతకన్నా లేదు.

రైతులకు టోకరా

కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాఫ్. 33 వేల కోట్లతో సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామనేది బూటకం. నిరుద్యోగులకు నెలకు 3 వేలు ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి హామీ పత్తాకు లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. తల్లికి వందనం కింద 20 లక్షల మంది బిడ్డలకు మోసం చేశారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారు. గోడ క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రాదు. కోటి మంది మహిళలకు నెలకు 15 వందలు ఇచ్చే ఆడబిడ్డ పథకానికి దిక్కులేదు.. కానీ 5 లక్షల మంది మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తున్నామని చెప్పడం పూర్తిగా హాస్యాస్పదం.

జీవనాడిలో జీవం తీశారు

P4 తో పేదరికం అరికట్టడం అనేది పచ్చి మోసం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా అభూత కల్పన. యూనివర్సల్ హెల్త్ పాలసీ పేరుతో సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని చంపారు. 1.43 కోట్ల కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్ష చేశారు. పోలవరం ఎత్తు 41.15 తగ్గించి జీవనాడిలో జీవం తీశారు. పెండింగ్ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వానికి సైతం పట్టింపు లేదు కానీ.. రాష్టానికి గుదిబండలా మారే పోలవరం - నల్లమలసాగర్‌పై అమిత ప్రేమ చూపిస్తున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత అంటూ చేస్తున్నవి డ్రామాలు తప్పిస్తే.. చేతలు మాత్రం ఆమడ దూరం. స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్ సిటీల పేరుతో, ఇతర హబ్ ల పేరుతో మళ్లీ అరచేతిలో వైకుంఠం తప్పా ఆచరణ నేటివరకు శూన్యం.

ఉద్దరించామని చెప్పడం సిగ్గుచేటు

ట్రూ అప్ పేరుతో 15 వేల కోట్ల భారం మోపి, ట్రూ డౌన్‌తో 4 వేల కోట్లు తగ్గించి ఉద్ధరించామని చెప్పడం సిగ్గుచేటు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వ్యవస్థ అభివృద్ధికి ఊతం ఇచ్చిన MGNREGAను కాదని VB G- RAM G పథకం గొప్పగా ఉందనడం కూటమి ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం. రాష్ట్రంలో సగటున 52 రోజుల పనికి దిక్కులేదు కానీ 125 రోజులతో ఉపాధికి ఊతం ఇస్తామనడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. టమాటో, ఉల్లి రైతులు కిలో రూపాయికి అమ్ముకున్నా పట్టింపు లేనోళ్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులను ఆదుకున్నాం అని చెప్పడం అత్యంత దారుణం. ఎరువులు ఇవ్వని చేతకానితనాన్ని కప్పి పుచ్చేందుకు భూసారాన్ని పెంచే చర్యలని గొప్పలు చెప్పడం కూటమి పాలన వైఫల్యానికి అద్దం పడుతుంది.

దమ్ము లేకపోతే రాజీనామా చెయ్ జగన్

కూటమి పాలన వైఫల్యాలను ఎత్తి చూపాల్సిన అవకాశం YCP కున్నా.. ఈసారి సైతం ప్రతిపక్షం ఇస్తేనే సభ ముందుకు అని చెప్పడం అత్యంత సిగ్గుచేటు. ఒక్కరోజు మురిపానికి కాదు కదా ప్రజలు ఓట్లేసి గెలిపించింది? మైకు ఇస్తేనే అంటూ మారం చేయడానికి కాదు కదా అసెంబ్లీకి పంపింది? జగన్ సొంత అజెండాను పక్కకు పెట్టి, ప్రజల అజెండాతో అసెంబ్లీకి వెళ్లాలి. కూటమి హామీలపై, నిర్లక్ష్యాలపై సభావేదికగా అధికార పక్షాన్ని నిలదీయాలి. శాసనసభకు వెళ్లే దమ్ము, ధైర్యం లేకుంటే రాజీనామాలు జగన్ చేయాలి. ఆయన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story