ఆ దమ్ము చంద్రబాబు, పవన్‌, జగన్.. ముగ్గురికీ లేదు: షర్మిల షాకింగ్ ట్వీట్

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.

ఆ దమ్ము చంద్రబాబు, పవన్‌, జగన్.. ముగ్గురికీ లేదు: షర్మిల షాకింగ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘చంద్రబాబు పాలనకు ఏడాది. ఈ ఏడాదిలో సాధించినది గొప్పలు చెప్పడమే. ఉద్ధరించినట్లు విజయపత్రం ఇచ్చారు. అది ఎన్నికల ప్రచార పత్రంలా ఉంది. ఏడాది గడిచినా సూపర్ సిక్స్‌కు దిక్కు లేదు. ఇప్పటివరకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదు. పండుగల పేరు చెప్పి కాలయాపన చేశారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాల కల్పన లేదు. రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. ఎన్నికల మేనిఫెస్టో అంటే ఐదేళ్ల కాలపరిమితి ఉండాలి. ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదు. తల్లికి వందనం కింద రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే.. 67 లక్షల మందికి ఇస్తారట. అంటే మిగిలిన 20 లక్షల మంది విద్యార్థులను మోసం చేయడమే కదా. మొత్తం 87 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాలి. ఇక అన్నదాత సుఖీభవ కూడా మోసమే. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. కత్తెర పేరుతో... 45 లక్షల మంది రైతులకు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవ ఇవ్వాలి.

ఉద్యోగాల పేరుతో బాబు చేసింది మోసమే. ఏడాది గడిచినా మహిళా శక్తి పథకం ఊసే లేదు. ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం అన్నారు. కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. సూపర్ సిక్స్ కాకుండా.. దాదాపు 140కి పైగా హామీలు ఇచ్చారు. ప్రతి ఏటా జనవరిలో క్యాబ్ క్యాలెండర్ అన్నారు. జనవరి దాటినా జాబ్ క్యాలెండర్ రాలేదు. రాష్ట్రంలో దాదాపు 2.70 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పుడూ భర్తీ చేస్తారో తెలియదు. ఏడాదిలో బాబు సాధించిన ప్రగతి రూ.17 వేల కోట్ల విద్యుత్ బిల్లుల భారం. సర్దుబాటు పేరుతో రెండు సార్లు భారం మోపారు. చంద్రబాబు సాధించిన ప్రగతి అప్పులు తీసుకోవడం. ఏడాదిలో దాదాపు లక్ష కోట్లు అప్పు తెచ్చారు. గతంలో జగన్ 6 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఇద్దరు కలసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారు. ఇక అమరావతి పేరుతో కూడా దాదాపు రూ.80 వేల కోట్లు అప్పులు తెస్తున్నారు. ఇన్ని అప్పులు ఎందుకు అని అడుగుతున్నాం. ఈ అప్పులు ఎలా తీరుస్తారు అని అడుగుతున్నాం.

బీజేపీ మోసం చేస్తుంటే బాబు నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదా హామీ ఏమయ్యింది అని అడిగే ధైర్యం బాబు, పవన్‌కి లేదు. బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి తొత్తులు. ఒకరిది అక్రమ పొత్తు, మరొకరిది సక్రమ పొత్తు. ఇదే కడప జిల్లాలో ఇచ్చిన కడప స్టీల్ ప్లాంట్ హామీ ఇంతవరకు నెరవేరలేదు. బాబు ఏడాది పాలన అరచేతిలో వైకుంఠం, 3D గ్రాఫిక్స్, మాయాజాలం. కాంగ్రెస్ పార్టీ పక్షాన చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీకి మద్దతు విరమించుకోవాలి. ఈ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రానికి ప్రత్యామ్నాయం’ అని ట్వీట్‌లో షర్మిల పేర్కొన్నారు.

Next Story