నిప్పుల కొలిమిలా ఏపీ.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు

by Naga Rani Yarlagadda |

అత్యధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. నేడు 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది.

నిప్పుల కొలిమిలా ఏపీ.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక ఉష్ణోగ్రతలతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. పగటివేళలోనే కాకుండా.. రాత్రి వేళ కూడా అధిక ఉష్ణోగ్రత ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలనకా, రాత్రనకా ఉక్కపోత పెరిగిపోతుండటంతో కంటిపై కునుకులేకుండా నానా తంటాలు పడుతున్నారు. నేడు రాయలసీమ, కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు.. 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 9, శ్రీకాకుళంలో 4, పోలవరంలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎండతీవ్రత, వడగాలులు, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దన్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా తరచుగా నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సోమవారం అత్యధికంగా కడపలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. నంద్యాల జిల్లా సంజామలలో 44, తిరుపతి జిల్లా వరదయ్యపాళెంలో 43.8, మార్కాపురం జిల్లా అనుమలపల్లిలో 43.2, కర్నూల్ జిల్లా గూడూరులో 43, పల్నాడు జిల్లా దుర్గిలో 42.8, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 42.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Next Story