శ్రీవారి భక్తులకు అలర్ట్: ఏప్రిల్ 18 నుంచి జూలై నెల సేవా, దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!

by Ramesh Naini |

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ (TTD) ముఖ్య గమనిక.

శ్రీవారి భక్తులకు అలర్ట్: ఏప్రిల్ 18 నుంచి జూలై నెల సేవా, దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు టీటీడీ (TTD) ముఖ్య గమనిక. రాబోయే జులై నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఉచిత దర్శన టోకెన్లు, అలాగే వసతి గదుల కోటాను ఏప్రిల్ 18 నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ తేదీలను గమనించి ముందుగానే తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని కోరారు.

ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డ్రా) సేవల వివరాలు

సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి విశేష సేవల కోసం భక్తులు ముందుగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు ప్రారంభం ఏప్రిల్ 18, ఉదయం 10:00 గంటలకు. నమోదుకు చివరి గడువు ఏప్రిల్ 20, ఉదయం 10:00 గంటల వరకు ఉంది. లక్కీ డ్రా (డిప్) విధానంలో ఎంపికైన భక్తులు ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:00 గంటల లోపు డబ్బులు చెల్లించి తమ టికెట్లను ఖరారు చేసుకోవాలి.

ఇతర ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల విడుదల షెడ్యూల్

ఏప్రిల్ 21, ఉదయం 10:00 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటా విడుదల. ఏప్రిల్ 21, మధ్యాహ్నం 3:00 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల కోటా. ఏప్రిల్ 23, ఉదయం 10:00 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ల కోటా విడుదల. ఏప్రిల్ 23, ఉదయం 11:00 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటా. ఏప్రిల్ 23, మధ్యాహ్నం 3:00 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం కేటాయించిన ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు. ఏప్రిల్ 24, ఉదయం 10:00 గంటలకు భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన (Special Entry Darshan) టికెట్ల కోటా. ఏప్రిల్ 24, మధ్యాహ్నం 3:00 గంటలకు: తిరుమల, తిరుపతిలలో అద్దె గదుల (Accommodation) బుకింగ్ కోటా విడుదల చేయనున్నారు.

గమనిక: దళారులను నమ్మి మోసపోవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారిక వెబ్‌సైట్లను ఆశ్రయించవద్దని టీటీడీ హెచ్చరించింది. భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

Next Story