ఏరియా ఆస్పత్రిలో షాడో పాలన.. ఇన్స్యూరెన్స్ పేరుతో వసూళ్లు?

by Naga Rani Yarlagadda |

సెకండరీ హెల్త్ శాఖ డీసీహెచ్ ( డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్,హెల్త్ సర్వీసెస్) గా ఉన్నారు.

ఏరియా ఆస్పత్రిలో షాడో పాలన.. ఇన్స్యూరెన్స్ పేరుతో వసూళ్లు?
X

దిశ ప్రతినిధి, నరసరావుపేట : సెకండరీ హెల్త్ శాఖ డీసీహెచ్ ( డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్,హెల్త్ సర్వీసెస్) గా ఉన్నారు. నరసరావుపేట ఏ రియా ఆసుపత్రి లో పట్టణానికి చెందిన ఓ ప్రముఖుడు షాడో డీసీహెచ్‌గా పెత్తనం చేస్తున్నాడు. జిల్లా డీసీహెచ్ రంగారావుకు ఆ షాడో ఆత్మీయుడు.. అతనిని చూస్తే ఏరియా ఆసుపత్రి సిబ్బంది హడలి పోవాల్సిందే. ఈ షాడో డీసీహెచ్ ఓ ఇన్స్యూరెన్స్ ఏజెంటు. ఆయన కోటక్ మహేంద్ర ఇన్స్యూరెన్స్ పాలసీ చేయమని అడిగితే ఎవరైనా చేయాల్సిందే. లేకుంటే వారి పై ఉన్నతాధికారులకు ఏదోరకమైన ఫిర్యాదు మెయిల్‌లో వెళ్తుంది. దీంతో ఆ ఉద్యోగి భయంతో వణికి పోతుంటారు. ఆ సమయంలో గుంటూరు డీసీహెచ్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ‘షాడో డీసీహెచ్ కు ఇన్స్యూరెన్స్ పాలసీ చేయి.. పెద్ద సారుకు నేను ఏదో చెప్పి ఇబ్బంది లేకుండా చేస్తాను’అని హామీ లభిస్తుంది. ఆ తరువాత షాడో డీసీహెచ్ ప్రత్యక్షమై రూ. లక్షకుపైగా చెల్లించే పాలసీ చేయిస్తాడు. ఇలా ఏరియా ఆస్పత్రులలో ఈ షాడో డీసీహెచ్ దోపిడి యథేచ్ఛగా సాగుతుంది. షాడో డీసీహెచ్‌కు భయపడి సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా హడలి పోయి పాలసీలు కడుతున్నారు.

అన్నింటా షాడో డీసీహెచ్ హస్తం

అలాగే మెడికల్ పీజీ కోర్సు లు చదివే విద్యార్థులు మూడు నెలలు డీఆర్పీ ప్రోగ్రామ్ కింద గ్రామీణ ప్రాంతాల ఆసుపత్రుల్లో పని చేయాలి. వారు పనిచేసినా చేయకున్నా ఈ షాడో డీసీహచ్ వారి వద్ద డబ్బులు తీసుకొని పని చేసినట్టు సర్టిఫికెట్స్ ఇప్పిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కాన్పులు చేయాల్సిన డాక్టరమ్మ ప్రసవానికి వచ్చిన మహిళ ల నుంచి రూ. 3 నుంచి 5 వేలు ముక్కు పిండి వసూలు చేస్తున్నా చర్యలు తీసుకొనే నాధుడే లేడు. సదరన్ సర్టిఫికెట్ కోసం వచ్చే వికలాంగుల నుంచి ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందినా పట్టించుకునే వారే లేరు. ఏరియా ఆస్పత్రిలో హాజరు ఐరిష్ పద్ధతిలో ఉంటుంది. ఈ షాడో డీసీహెచ్ ఎవరికి హాజరు పడాలో, పడకూడదో చెబుతుంటాడు. ఆయన ఆజ్ఞప్రకారమే ఐరిష్ యంత్రమూ పనిచేస్తుంది. ఈ షాడో దెబ్బకు ఇటీవల ఓ హెడ్ నర్సు సైతం ఎంతో ఇబ్బందికి గురైంది. అలాగే ఆయన వేధింపులకు సూపరింటెండెంట్ సైతం ఈ ఉద్యోగం నాకు వద్దు బాబోయ్ అంటూ ఆ స్థానం నుంచి తనను తప్పించాలని ఉన్నతాధికారులకు విన్నవించుకన్నట్లు సమాచారం. డీసీహెచ్ రంగారావు, షాడో డీసీహెచ్ ఆయన ముఠా చేసే అక్రమాల గురించి ఫిర్యాదు చేసినప్పటికీ సత్తెనపల్లి ప్రాంతానికి చెందిన ఓ జాయింట్ కమిషనర్ ఈ ముఠాకు అండగా ఉంటూ వారిని కాపాడుతున్నారన్నని ఆస్పత్రిలోని ఉద్యోగులు, సిబ్బంది చెబుతున్నారు. మొత్తంగా ఈ షాడో డీసీహెచ్ నుంచి తమను, ఆస్పత్రిని కాపాడాలని నరసరావుపేట, సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి సిబ్బంది కోరుకుంటున్నారు.

Next Story