- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
500 మంది పోలీసుల పహారాలో ఆకివీడు.. డీఎస్పీ కీలక హెచ్చరిక

దిశ, వెబ్‌డెస్క్: గత నెల 28న పెదపేటలో శ్రీరామనవమి వేడుకలకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వ్యవహరించిన తీరుతో దళితులు, ఇతరుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 60 మంది దళితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, ప్రజాసంఘాలు, అభ్యుదయ వాదులు, వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని ఖండించాయి. ఈ క్రమంలో నేడు చలో ఆకివీడుకు అటు క్రైస్తవ, ఇటు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఆకివీడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
మళ్లీ ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో డీఎస్పీ రఘువీర్ విష్ణు అప్రమత్తమయ్యారు. ఆయన ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీసులు మొత్తం 500 మంది పోలీసులు ఆకివీడులో పహారా కాస్తున్నారు. ఆకివీడులోకి ఎవ్వరినీ రానివ్వడం లేదు. ఆకివీడు దత్తగుడి నుంచి నిర్వహించే భారీ ర్యాలీకి తరలి రావాలని వాట్సాప్, ఫేస్ బుక్ లో విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ప్రచారం చేశాయి. వాటి తీరుకు నిరసనగా క్రైస్తవ సంఘాలు కూడా దళితులకు మద్దతిస్తూ చలో ఆకివీడుకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి 2000 ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఆకివీడుకు చేరినట్లు సమాచారం.
రెచ్చగొడితే అరెస్ట్ చేస్తాం
రెండు సంఘాల పిలుపుతో ఆకివీడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉండటంతో.. చలో ఆకివీడుకు ఎవరికీ ఎలాంటి పర్మిషన్ లేదని ఆర్డీఓ ప్రవీణ్ , డీఎస్పీ రఘువీర్ ప్రకటించారు. ఈ క్రమంలో స్థానికంగా 144, 30 సెక్షన్లు అమల్లో ఉన్నాయని తెలిపారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని హెచ్చరించారు. కాదని ఎవరైనా చేస్తే.. చట్టపరమైన కేసులు నమోదు చేస్తామన్నారు. కొత్తవ్యక్తులెవరూ గ్రామంలోకి రాకుండా.. ఉప్పుటేరు, ఉండి దగ్గర తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా మత విద్వేషాలను రెచ్చగొడితే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు.






