Sajjala: స్క్రిప్ట్, స్కెచ్ బై.. సజ్జల!

by Thanuru Gopichand |

గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడినా, ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేసినా.. దాని వెనుక స్కెచ్​ఆయనే అనే ఆరోపణలు వచ్చాయి.

Sajjala: స్క్రిప్ట్, స్కెచ్ బై.. సజ్జల!
X

దిశ, డైనమిక్ బ్యూరో : గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు.. టీడీపీ నేతలపై దాడులకు తెగబడినా, ఆ పార్టీ కార్యాలయంపై దాడి చేసినా.. దాని వెనుక స్కెచ్​ఆయనే అనే ఆరోపణలు వచ్చాయి.ఆయనే సజ్జల రామ కృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). బోరుగడ్డ అనిల్​నుంచి పోసాని (posani) వరకు ఎంతమంది రెచ్చిపోయి మాట్లాడినా ఆ స్క్రిప్టు ఇచ్చింది ఆయనే అని చెబుతున్నారు. జెత్వానీ (jatwani)కేసులో పోలీసులను బలి చేయడం వెనుక కూడా సజ్జలే ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు తనకు వాటితో ఏమీ సంబంధం లేదంటూ సజ్జల చేతులు దులుపుకొంటున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళి కేసులో ఆయన పేరు వినిపించడంతో అప్రమత్తమయ్యారు. ముందస్తు బెయిల్​ కోసం సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్(Bhargav)​హైకోర్టును ఆశ్రయించారు. ముంబైకి చెందిన సినీ నటి జెత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమెను ముంబై నుంచి తీసుకు వచ్చి వేధించిన కేసులో అప్పటి ఐపీఎస్​అధికారులు సస్పెన్షన్​కు గురయ్యారు. వారి వెనుక ఉండి నడిపించింది సజ్జల అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాడేపల్లి కేంద్రంగా ఆయనే ఈ కథ వెనుకుండి నడిపించారని చెబుతారు. ఈ కేసులో సజ్జల ప్రమేయంపై కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు అప్పట్లో హోంమంత్రి అనిత ప్రకటించారు. అదేవిధంగా వైసీపీకి చెందిన బోరుగడ్డ అనిల్​అరెస్టు అయిన విషయం తెలిసిందే. అతని విచారణ సమయంలో కొన్ని సంచనల విషయాలు వెలుగు చూశాయి. తాను చేసిన హెచ్చరికలు, మాట్లాడిన బూతులన్నీ వైసీపీ(ycp) ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అని బోరుగడ్డ వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ కార్యాలయం అంటే స్వయానా సజ్జల అని టీడీపీ ఆరోపించింది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఏ120గా నిందితుడిగా ఉన్న ఆయనకు లుక్​అవుట్​నోటీసు కూడా జారీ అయింది. ఆయన మంగళగిరి పోలీస్​స్టేషన్​లో విచారణకు కూడా హాజరయ్యారు. మొన్న అరెస్టు అయిన పోసాని కృష్ణ మురళి తన నేర అంగీకార పత్రంలో సజ్జల పేరును ప్రస్తావించారు. రామకృష్ణారెడ్డి పంపిన ‘స్ర్కిప్టు’ ప్రకారమే మాట్లాడానని, తన మాటల వీడియోలను సజ్జల కుమారుడు భార్గవ్‌రెడ్డి వైరల్‌ చేశారని పోసాని పేర్కొన్నట్లు సమాచారం. తాను కావాలని మాట్లాడలేదని సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి స్క్రిప్ట్ ఆధారంగానే చంద్రబాబు(chandrababu), పవన్ కల్యాణ్‌ను (pawan kalyan) తిట్టానని పోసాని ఒప్పుకున్నాడు. దీంతో అప్రమత్తమైన వారిద్దరు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని, అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారని తమ పిటిషన్లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ కేసుల్లో ఇరికిస్తున్నారని, తమకు ముందస్తు బెయిల్ ఇస్తే విచారణకు సహకరిస్తామన్నారు. ఈ పిటిషన్​రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వైఎస్సార్‌ జిల్లా సీకే దిన్నె మండలంలో అటవీ భూములను ఆక్రమించారనే ఆరోపణలు సజ్జల ఎదుర్కొంటున్నారు. ఆ అభియోగాలపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. త్వరలో వైసీపీలోని ఓ కీలక నేత అరెస్టు ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story