ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళ‌న‌.. అరెస్ట్

by Thanuru Gopichand |

న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన బాట పట్టిన వ్యాపారవేత్తలు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆందోళ‌న‌.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తమకు రావాల్సిన పారిశ్రామిక రాయితీలను తక్షణమే విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత కొంత కాలంగా మంగళగిరిలోని ఏపీఐఐసీ (APIIC) కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారి ఆందోళన కార్యక్రమం బుధవారం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులకు, పారిశ్రామికవేత్తలకు మధ్య తోపులాట జరిగి కాసేపు యుద్ధ వాతావరణం తలపించింది. పోలీసుల తీరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం బడా కంపెనీలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తోందని.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమ లాంటి చిన్నతరహా పారిశ్రామికవేత్తలను విస్మరిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పారిశ్రామికవేత్తల సంఘం నేతలు మండిపడ్డారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, జరిమానాలు కట్టలేక తాము ఆత్మహత్యల దిశగా వెళ్తున్నామని వాపోయారు. రాయితీలు వస్తాయన్న నమ్మకంతోనే ఇన్నాళ్లు వేచి చూశామని వారు పేర్కొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచి వేల కోట్లు మాఫీ చేస్తున్న ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన నిధులను ఎందుకు ఆపుతోంది? అని వారు ప్రశ్నించారు. పోలీసు అరెస్టులతో తమ గొంతు నొక్కలేరని, తమకు రావాల్సిన చివరి రూపాయి వచ్చే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీఐఐసీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలను అధికారులు మోహరించారు.

Next Story