- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్రాంతి వేడుకలు.. అమలాపురం వీధుల్లో ‘టెస్లా సైబర్ ట్రక్’ హడావుడి
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా టెస్లా కంపెనీకి చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనం ‘సైబర్ ట్రక్’ సందడి చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సంక్రాంతి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా టెస్లా కంపెనీకి చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనం ‘సైబర్ ట్రక్’ సందడి చేసింది. భారత్‌లో అత్యంత అరుదుగా కనిపించే ఈ వాహనం అమలాపురం వీధుల్లో కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కారును చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగబడ్డారు. చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆదిత్య రామ్ గ్రూప్ చైర్మన్ ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సైబర్ ట్రక్‌లో అమలాపురానికి వచ్చారు. ‘అమలాపురం అల్లుడు’గా పేరుగాంచిన ఆయన ప్రతి ఏటా సంక్రాంతికి అత్తవారింటికి రావడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. గత ఏడాది రోల్స్ రాయిస్ కారులో వచ్చిన ఆదిత్య రామ్, ఈ సారి టెస్లా సైబర్ ట్రక్‌లో రావడం గమనార్హం.
విలువ దాదాపు రూ.2 కోట్లు!
టెస్లా కంపెనీ సైబర్ ట్రక్‌ను భారత్‌లో అధికారికంగా విక్రయించడం లేదు. ప్రస్తుతం దేశంలో టెస్లా ‘మోడల్ Y’ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆదిత్య రామ్ ఈ వాహనాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. దిగుమతి సుంకాలు, పన్నులతో కలిపి దీని విలువ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అత్యాధునిక డిజైన్, ప్రత్యేక ఆకృతితో ఉన్న సైబర్ ట్రక్‌ను చూసిన ప్రజలు సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు పోటీపడ్డారు. ఈ వాహనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పండుగ ఉత్సవాలతో పాటు సైబర్ ట్రక్ హడావుడితో అమలాపురం వీధులు సందడిగా మారాయి.






