కోనసీమలో ఘోర ప్రమాదం.. నడిరోడ్డుపై కాలిబూడిదైన కారు

by Naga Rani Yarlagadda |

కారులో ప్రయాణిస్తోన్న ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రోడ్డుపై మంటలు చెలరేగగా కారు పూర్తిగా కాలి బూడిదైంది.

కోనసీమలో ఘోర ప్రమాదం.. నడిరోడ్డుపై కాలిబూడిదైన కారు
X

దిశ, వెబ్‌డెస్క్: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆలమూరు మండలం మడికి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు కారు మొత్తానికి వ్యాపించి వాహనం పూర్తిగా అగ్నిగోళంలా మారిపోయింది.

తృటిలో తప్పిన ప్రాణాపాయం..

మడికి వద్ద కారు వెళ్తుండగా ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. కారులోని ప్రయాణికులు తక్షణమే కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలోనే మంటలు వాహనం అంతటా వ్యాపించాయి. అయితే, నడిరోడ్డుపై కారు భారీ మంటలతో కాలిపోతుండటం, టైర్లు పేలుతున్న శబ్ధాలకు స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను చూసి భయంతో అటు ఇటు పరుగులు తీశారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిబూడిదైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Next Story