కొరడా ఝుళిపిస్తున్న ఆర్టీఏ అధికారులు

by Thanuru Gopichand |

పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ.

కొరడా ఝుళిపిస్తున్న ఆర్టీఏ అధికారులు
X

దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో అన్ని ప్రాంతాలు సందడిగా మారిపోతాయి. దేశ, విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వాసులు తమ స్వగ్రామాలకు పయనమవుతారు. కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబురాలను జరుపుకుంటున్నారు. అందులోనూ చాలా మంది హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు పయనమవుతారు. బస్సులు, కార్లు, రైళ్లు అనే తేడా లేకుండా అందుబాటులో ఉన్న ప్రతి ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల అవస్థలు కూడా పడుతుంటారు. కానీ పండుగ.. అందులోనూ పెద్ద పండుగ.. ఎలాగైనా ఇంటికి చేరాలనే తపన వారిని వెంటాడుతూ ఉంటుంది. దీంతో ఆపసోపాలు పడుతూ సంక్రాంతి సమయానికి ఇంటికి చేరిపోతుంటారు.

అయితే ఇదే అదనుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) యాజమాన్యాలు రెచ్చిపోతుంటాయి. అరకొర వసతులకు కూడా అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తాయి. పేద, ధనిక బేధం లేకుండా.. ప్రయాణించాలంటే అడిగినంతా పెట్టి టిక్కెట్ కొనాల్సిందేనని డిసైడ్ చేసేస్తాయి. కాదు కూడదు అంటే.. ప్రయాణం మానుకోండని పరోక్షంగానే ప్రయాణికులకు హితవు పలుకుతుంటాయి. ప్రతి ఏడాది ఇదే తీరుతో దోచుకున్నోడికి దోచుకున్నంత అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా సాగిపోతూ ఉంటుంది. ఇక చేసేది ఏమి లేక ఏపీకి వెళ్లే ప్రయాణికులు కూడా ఎంత ఎక్కువైనా డబ్బులు (Prices Hike) చెల్లించి టిక్కెట్ కొనేస్తుంటారు.

ఈ ఏడాది అటువంటి పరిస్థితి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆర్టీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఎవరైనా అధిక ధరలకు టిక్కెట్ విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. చర్యల్లో భాగంగా విశాఖపట్నం ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన తనికీల్లో సుమారు ఆరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖకు డబుల్ రేట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.30వేల ఫైన్ ను ఒక్కో బస్సుకు విధించారు. పండుగ వేళ అధిక ధరలకు టిక్కెట్ లు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. ఆయా ట్రావెల్స్ నిర్వహణపై నిఘాను ఉంచామని వెల్లడించారు.

Next Story