కుటుంబానికి రూ.25 లక్షలు.. పేదలకు ఆరోగ్య బీమా

by Thanuru Gopichand |

ఏపీలోని పేదలు అందరికీ ఉచిత ఆరోగ్యబీమా కల్పించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.

కుటుంబానికి రూ.25 లక్షలు.. పేదలకు ఆరోగ్య బీమా
X

దిశ, డైనమిక్​ బ్యూరో: ఏపీలోని పేదలు అందరికీ ఉచిత ఆరోగ్యబీమాకల్పించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.ఎన్టీఆర్ ​వైద్యసేవ స్థానంలోఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల విలువైన వైద్యసేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. అది కూడా ఆస్పత్రిలో చేరిన ఆరుగంటల్లోనే చికిత్సకు అనుమతి లభించనుంది. బీమా నగదు చెల్లింపులు కూడా వేగంగా పూర్తికానున్నాయి. గతేడాది జూన్​లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్యసేవలు, వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ, పరిపాలనను పటిష్టం చేయాలనే ఆయన ఆలోచనలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్​30 అంశాలతో కూడిన అజెండాను రూపొందించారు. వీటిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పనితీరు, ఫలితాలను సమీక్ష జరపాలని ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబును ఆదేశించారు. అందులో భాగంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, హైబ్రిడ్ విధానంలో రూ.25 ల‌క్షల బీమాను డాక్టర్​ఎన్టీఆర్​వైద్యసేవ ట్రస్ట్​ద్వారా త్వరలో ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా పీపీపీ విధానంలో 10 ప్రభుత్వ వైద్య క‌ళాశాల‌ల నిర్వహ‌ణను చేపట్టనున్నారు.

ముఖ్యమంత్రి ఆలోచ‌న‌ల మేర‌కు ఈ అజెండాలో ఇంకా పలు అంశాలను పొందుపరిచారు. ఆరోగ్య రంగానికి సంబంధించి స్వర్ణాంధ్ర-2047 విజ‌న్ ప‌త్రంలోని ల‌క్ష్యాల్ని ప్రజలకు తెలిపి ల‌క్ష్య సాధ‌న ప్రజలను భాగస్వాములుగా చేస్తారు. వాట్సాప్ ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవలను గుర్తించి చర్యలను చేపడతారు. త్వరితగతిన నిర్ణయాలను తీసుకునేందుకు అవ‌స‌ర‌మైన వికేంద్రీక‌ర‌ణ‌ జరగనుంది. వైద్య సేవ‌ల్లో కృత్రిమ మేథ‌ పూర్తి వినియోగ అవ‌కాశాల్ని గుర్తింపు, డిజిట‌ల్ వైద్య సేవ‌ల్ని విస్తృతం చేస్తారు. వైద్యులు, ఇత‌ర సిబ్బంది ఖాళీల‌ను భ‌ర్తీ చేయడం, వివిధ ప‌థ‌కాల కింద కేంద్ర ప్రభుత్వ సాయాన్ని రాబట్టడం, వివిధ విభాగాధిప‌తులు, వైద్యులు, అధికారుల ప‌నితీరును నిస్పక్షపాత ఫ‌లితాల ప్రాతిప‌దిక‌న మ‌దింపు చేస్తారు. వివిధ స్థాయిల్లో జ‌వాబుదారీత‌నం కోసం ప‌టిష్ట చర్యలు, పర్యవేక్షణ చేపట్టనున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో అవినీతిని రూపుమాపి, విభాగాధిప‌తులు, వివిధ ప‌థ‌కాల నోడ‌ల్ అధికారులు ప‌థ‌కాల అమ‌లు, ప‌నితీరుపై నెల‌వారీ నివేదిక‌ల్ని అందించాల్సి ఉంటుంది. ప్రజల్లో శుభ్రత, ఆరోగ్య అలవాట్లను పెంచడానికి కార్యాచరణ రూపొందిస్తారు. రాష్ట్రం, దేశ విదేశాల్లో ఆరోగ్య సేవ‌ల తీరును మ‌దింపు చేసి సేవ‌ల నాణ్యతను పెంచ‌డానికి మంత్రిత్వ శాఖకు స‌లహాలిచ్చేందుకు వైద్య, ఆరోగ్య రంగ నిష్ణాతుల‌తో స‌ల‌హా, సంప్రదింపుల క‌మిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ అజెండాలోని అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా​నెల వారీ సమీక్షలు నిర్వహించనున్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్​ వెల్లడించారు.

Next Story