రైతుల పేరిట రౌడీయిజమా ?

by Thanuru Gopichand |

రైతుల పేరిట జగన్​ రౌడీయిజం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రులు ఓ రేంజ్​ లో ఫైరయ్యారు.

రైతుల పేరిట రౌడీయిజమా ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : రైతుల పేరిట జగన్​ రౌడీయిజం చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రులు ఓ రేంజ్​ లో ఫైరయ్యారు. మిర్చి యార్డు పర్యటన అనంతరం జగన్​ పై ఇవాళ వారంతా వేర్వేరుగా స్పందించారు. జగన్ చేసేవన్నీ డ్రామాలు అని మండిపడ్డారు. తన భద్రతపై జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నారు. నాడు పరిపాలనలో, నేడు ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ జగన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రైతుల పేరు చెప్పి మిర్చి యార్డులో రౌడీయిజం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు భద్రత పేరుతో సానుభూతి నాటకాలు ఆడుతున్నారనీ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి గుంటూరులో బల ప్రదర్శన చేసి రైతులను ఇబ్బంది పెట్టిన జగన్ ను చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్​ చేశారు. వైసీపీ కార్యకర్తల వీరంగం కారణంగా ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఇప్పుడు భద్రత పేరుతో కొత్త నాటకానికి తెర లేపారని ఆరోపించారు. నిబంధనలకు అనుగుణంగా జగన్ రెడ్డికి భద్రత ఉందని, తాము తగ్గించిందేమీ లేదని మంత్రి అనగాని స్పష్టం చేశారు.

ఇదే అంశంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జగన్ పర్యటనకు అనుమతులు లేవని కలెక్టర్ ముందుగానే తెలియజేశారని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను సైతం జగన్ ధిక్కరించారని ఆరోపించారు. తనకు భద్రత లేదంటూ జగన్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నాడని విమర్శించారు. జగన్​ కు లండన్ మందులు వికటించినట్లు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టిసుభాశ్​ ఎద్దేవా చేశారు. మగాళ్ళ అందాల గురించి, పోలీసులు బట్టలు విప్పడం గురించి ఆయన మాటలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కూడా ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీకి రాని వ్యక్తి, రైతుల పేరుతో నానా యాగి చేస్తున్నారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

మిర్చికి చంద్రబాబు హయాంలో రూ.13 వేల మద్దతు ధర ఇవ్వగా, జగన్ ప్రభుత్వం కేవలం రూ.7 వేలే ఇచ్చినట్లు టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇదే విషయాన్ని నిన్న మంత్రి అచ్చెనాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2020-2 1లో క్వింటా మిర్చి ధర రూ.12 వేలు పలుకుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం 7000 మద్దతు ధర ప్రకటించిన సంగతి వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతో చంద్రబాబు నాలుగు సార్లు కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. జగన్ అబద్ధాలు ఆడుతున్నాడని ఆరోపించారు. మొత్తం మీద సుదీర్ఘకాలం తర్వాత వైఎస్ జగన్ ప్రజలలోకి వెళ్లాలన్న వ్యూహం బెడిసికొట్టిందని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తోంది. రైతులు పేరు చెప్పి రౌడీలతో జగన్​ మిర్చి యార్డుకు వెళ్లి హడావుడి చేశాడని, పైగా భద్రత పేరు చెప్పి విషయాన్ని డైవర్ట్ చేస్తున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Next Story