సత్యదేవుని వ్రతంలో కుళ్లిన తమలపాకులు!

by Bhoopathi Nagaiah |

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ అధికారులపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

సత్యదేవుని వ్రతంలో కుళ్లిన తమలపాకులు!
X

దిశ, అన్నవరం : అన్నవరం సత్యదేవుని వ్రతానికి దేశవిదేశాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. కొత్తగా వివాహం చేసుకున్నా, నూతనంగా ఇల్లు నిర్మించుకున్నా ముందుగా చేసుకునేది సత్యనారాయణ స్వామి వ్రతం. అంతటి మహోన్నతమైన సత్యదేవుని వ్రతం సాక్షాత్తు స్వామివారి సన్నిధిలో నిర్వహించేటప్పుడు ఎంతటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడి అధికారులకు తెలియడం లేదు. వ్రత సామగ్రి సరఫరా చేసే గుత్తేదారులతో చేతులు కలిపి నాసిరకం సామగ్రిని సరఫరా చేస్తున్నా కళ్ళకు గంతలు కట్టుకుని నిద్రపోతున్నారన్న సందేహం కలగక మానదు. అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ నాసిరకమే..

వ్రతానికి అవసరమైన సామగ్రిలో రేషన్ బియ్యం కంటే దారుణంగా ఉన్న బియ్యాన్ని వేస్తున్నారు. అలాగే కుళ్లిపోయిన, చీడ పట్టిన తమలపాకులు, వక్కలుకు బదులు రంగు రంగు చెక్క ముక్కలు వాడుతున్నారు. వీటిపై పలుమార్లు వ్రతం చేసుకునే దంపతులు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. దీనికితోడు ఆ సామగ్రిని సరఫరా చేసే టెండరు దారుడికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు కూడా కొండపై ప్రచారం జరుగుతోంది. నెలవారీ మామూళ్లతో తమ ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ఇక్కడి అధికారులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా అంటూ భక్తులు ఆరోనిస్తున్నారు.

ఆలయ అధికారులపై తీవ్ర విమర్శలు

వ్రతముల విభాగంలో ఒక ఏఈవో, ఒక సూపరింటెండెంట్, ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులు ఉంటారు. వీళ్లు విధులు నిర్వర్తించే 8 గంటలు కూడా కార్యాలయాలకి పరిమితం కావడంతో పాటు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ప్రతీ రోజూ వేల మంది వ్రతాలు నిర్వహిస్తారు. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారులే అన్న కోవలో అధికారులు భక్తుల్ని చిన్నచూపు చూడడం సర్వసాధారణం అయిపోయింది ఇక్కడ. దీని కారణంగానే గత ఏడాది ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యూ ఆర్ కోడ్ విధానంలో అన్నవరం దేవస్థానం 7వ స్థానానికి పడిపోయిందంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదనే అంటున్నారు. భక్తుల ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ ఉన్నతస్థాయి అధికారులు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ అధికారులు సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎవరి ఇష్టం వారిదే అన్న రీతిన ఉద్యోగాలు వ్యవహరిస్తుడం పట్ల భక్తులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. తరచూ జిల్లా అధికారులు పర్యవేక్షణ చేస్తేనే ఇక్కడి పరిస్థితులు మారుతాయని అభిప్రాయపడుతున్నారు.

Next Story