Chandrababu: రోబోకు హాయ్ ​చెప్పిన సీఎం చంద్రబాబు

by Thanuru Gopichand |   (  Updated:2025-08-20 08:29:26  IST  )

ప్రతి ఒక్కరూ జాబ్ కోసం చూడొద్దని, పది మందికి జాబ్స్ ఇచ్చేలా ఎదగాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

Chandrababu: రోబోకు హాయ్ ​చెప్పిన సీఎం చంద్రబాబు
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ప్రతి ఒక్కరూ జాబ్ కోసం చూడొద్దని, పది మందికి జాబ్స్ ఇచ్చేలా ఎదగాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ ఉద్యోగి ఉండాలని కృషి చేశానని, ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త రావాలనేదే తన నినాదమని చెప్పారు. మంగళగిరి మయూరి టెక్ పార్క్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఇవాళ ఆయన ప్రారంభించారు. మంత్రులు నారా లోకేశ్​, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, మాజీఎంపీ గల్లా జయదేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రోబో స్వాగతం పలకడం ఆకట్టుకుంది. విశాఖపట్నం, రాజమహేంద్ర వరం, అనంతపురం, తిరుపతిలలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లను వర్చువల్ గా ప్రారంభించారు. స్టార్టప్ ల ప్రోత్సాహం, కొత్త పారిశ్రామిక వేత్తలు, ఇంటికో ఎంట్రప్రెన్యూర్ లక్ష్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి ఏదైనా చేయాలని రతన్​ టాటా పరితపించేవారన్నారు. హైదరాబాద్​ ఐటీ అభివృద్ధికి ​తనతో టాటా సూచనలు పంచుకున్నారని తెలిపారు. రతన్ టాటా భవిష్యత్ తరాలకు స్పూర్తి ప్రదాత అన్నారు. అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుచేశామని సీఎం పేర్కొన్నారు.

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంటర్ ప్రెన్యూర్

వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ ప్రెన్యూర్ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు ఆర్​టీఐహెచ్​ కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. విశాఖలో జీఎంఆర్ గ్రూప్, రాజమండ్రిలో గ్రీన్ కో, విజయవాడ గుంటూరులో మేఘ గ్రూప్, తిరుపతిలో అదానీ గ్రూప్, అనంతపురంలో జిందాల్ గ్రూప్ ట్రైనింగ్ ఇస్తాయని వెల్లడించారు. త్వరలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించబోతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కమ్యూనిజం, క్యాపిటలిజం ఏమీ ఉండదని, కేవలం టూరిజమే ఉంటుందని చెప్పారు. ప్రతి నియోజకర్గంలో ఒక ఇండస్ట్రియల్ ​పార్కు ఏర్పాటు చేయడమే లక్ష్యమని తెలిపారు. ఒక వైపు సంపద సృష్టిస్తూనే, పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చంద్రబాబు స్పష్​టం చేశారు.

విజనరీ లీడర్​ చంద్రబాబు : చంద్రశేఖరన్​

టాటా సన్స్ సీఈఓ చంద్రశేఖరన్ మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ లీడర్ అని ప్రశంసించారు. రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎంకు అభినందనలు తెలిపారు. ఐటీ రంగం అభివృద్ధిలో చంద్రబాబు కీల కంగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇన్నోవేషన్ కీలకంగా మారిందని, దీని ద్వారా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉందని తెలిపారు. రతన్ ​టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ ​హబ్ ​ప్రారంబిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు సరైన విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుందని అభిప్రాయపడ్డారు.

సవాళ్లకు తగినట్లుగా అవకాశాలు : లోకేశ్​

మంత్రి నారా లోకేశ్​ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఆలోచనలకు తగ్గ ఫలితాల సాధనే లక్ష్యంగా ఇన్నోవేషన్ ​హబ్ ​పనిచేస్తుందన్నారు. సవాళ్లకు తగ్గట్టుగానే అవకాశాలు అందిపుచ్చుకునే కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఆవిష్కణల హబ్ ​గా ఏపీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. వ్యాపారం అంటే లాభాలే కాదని, విలువలు అని రతన్ ​టాటా నిరూపించారని కొనియాడారు.

Next Story