- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila:‘కడప స్టీల్ ప్లాంట్ పై మీ ముసుగు తీయండి సార్’.. వైఎస్ షర్మిల సంచలన ట్వీట్!
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై ఏపీ పీసీసీ(AP PCC) చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ‘కడప స్టీల్ ప్లాంట్(Kadapa Steel Plant) ఏర్పాటుపై కేంద్ర మంత్రి HD కుమారస్వామి గారు చేసిన వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర ప్రజలను అవమానించినట్లే అని వైఎస్ షర్మిల అన్నారు. వాటిని ఏపీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. అసలు ప్లాంట్ ప్రతిపాదనే తమ దగ్గర లేదని అపహస్యం చేసినట్లు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అన్నారు. ప్రతిపాదన వస్తే ఆలోచన చేస్తామని చెప్పడం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలతో బీజేపీ చెలగాటం ఆడుతుంది అనడానికి నిదర్శనం అన్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఎంపీలు మౌనంగా ఉండటం వారి చేతకానితనానికి అద్దం పడుతుంది అని విమర్శించారు.
కడప ఉక్కు సీమ ప్రజల హక్కు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమే SAIL ఆధ్వర్యంలో నిర్మించి ఇచ్చేలా కాంగ్రెస్ సారథ్యంలోని UPA ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది అని తెలిపారు. విభజన చట్టంలోనూ పెట్టింది. అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ విభజన హామీలను కాల రాసింది. సీమ ప్రజల మనోభావాలను దెబ్బతీసింది అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. కడప ప్రజలకు తీరని ద్రోహం చేసింది. తిరుపతి వేదికగా కడప స్టీల్ పై హామీ ఇచ్చిన మోడీ.. తర్వాత సాధ్యం కాదని, సొంత గనులు లేకుండా కష్టమని, లాభదాయకంగా లేదని సన్నాయి నొక్కులు నొక్కారు అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం.. కడప స్టీల్ పై మీ వైఖరి ఏంటి ? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పై మీ ముసుగు తీయండి సార్ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని మాజీ సీఎం జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారు అని గుర్తు చేశారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అన్నారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలో ఉందంటే మీ మద్దతు తోనే. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించండి’ అని వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.






