- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నమయ్య జిల్లాలో పునర్విభజన సెగలు
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జిల్లాల పునర్విభజన ప్రక్రియ అన్నమయ్య జిల్లాలో (Annamayya District) తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) జిల్లాల పునర్విభజన ప్రక్రియ అన్నమయ్య జిల్లాలో (Annamayya District) తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏర్పడిన ఈ జిల్లా.. ప్రస్తుతం మనుగడ కోల్పోయే దిశగా సాగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అన్నమయ్య జిల్లాను రద్దు చేసి, అందులోని నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో విలీనం చేసే ప్రతిపాదన తెరపైకి రావడంతో రాజకీయంగా వాతావరణం వేడెక్కింది. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలన్న డిమాండ్‌తో ఇప్పటికే గత రెండు వారాలుగా రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజా వార్తలు రాయచోటి వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా కేంద్రం హోదాను కాపాడుకునేందుకు రాయచోటిలో జేఏసీ (JAC) ఆధ్వర్యంలో ఆదివారం సంపూర్ణ బంద్ పాటించారు.
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 28కి పరిమితం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేసే అవకాశం ఉంది. రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను తిరిగి వైఎస్ఆర్ కడప జిల్లాలో కలపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. రాయచోటి నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న మదనపల్లి జిల్లాలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని భౌగోళిక సామీప్యత దృష్ట్యా తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన ప్రభుత్వం, డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది.
ఈ అనిశ్చితి వల్ల అటు రాయచోటి, ఇటు రాజంపేట ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉండాలని, మదనపల్లిలో కలపడం సరికాదని స్థానికులు నిరసన తెలుపుతున్నారు. కొందరు ఆందోళనకారులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మరోవైపు.. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో 'ప్రజా గర్జన' ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భౌగోళికంగా, చారిత్రక ప్రాధాన్యత కలిగిన రాజంపేటను విస్మరించి రాయచోటిని కేంద్రం చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు వాదిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం అన్నమయ్య జిల్లా భవితవ్యాన్ని తేల్చనుందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.






