- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్ తరహా హైవేలు.. సింగారంగా మారుతోన్న రాయలసీమ
వంకర్లు లేకుండా, అదరకుండా సింగపూర్ సింగారాలొలికించే అద్భుతమైన రోడ్లుగా రాయలసీమలోని జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి.

దిశ ప్రతినిధి, కడప: వంకర్లు లేకుండా, అదరకుండా సింగపూర్ సింగారాలొలికించే అద్భుతమైన రోడ్లుగా రాయలసీమలోని జాతీయ రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. ముందున్న రహదారులను అభివృద్ధి పరచడంతో పాటు రెండు కొత్త రహదారులు నాలుగు వరుసల హైవేలుగా నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో రెండు కొత్త రహదారులు జాతీయ ప్రమాణాలతో పనులు జరుగుతుండగా రెండు రోడ్ల అభివృద్ధి, సొరంగ మార్గం పనులకు కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ రహదారులు పూర్తి అయితే రాయలసీమ గుండా ప్రధాన నగరాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళేందుకు అద్భుతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. అంతేకాదు ప్రతిష్టాత్మకమైన, పటిష్టమైన జాతీయ రహదారుల వ్యవస్థకు రాయలసీమ ప్రత్యేకతను సంతరించుకోనుంది.
రూ.920 కోట్లతో సొరంగ మార్గం
కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిలో కడప అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మధ్యలో ఉన్న తొమ్మిది కిలోమీటర్ల ఘాట్ రోడ్డు నిత్యం ప్రమాదాలకు దారితీస్తోంది. దేశంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్‌లో ఇదొకటిగా గుర్తించారు. ప్రతి నిమిషానికి ఒక వాహనం ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఘాట్ రోడ్‌లో భారీ వాహనాలు బ్రేక్ ఫెయిల్ అయి ఇతర వాహనాల మీద పడిపోవడం, వాహనాలు అదుపుతప్పి లోయలో పడిపోవడం, మలుపు వద్ద యాక్సిడెంట్లు జరగడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉంటాయి. అనేకమార్లు రాత్రి వేళల్లో కూడా ఇలాంటి ప్రమాదాలు రక్తమోడిన సంఘటనలు ఉన్నాయి. ఇలా జరిగిన ప్రతిసారి వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి. ఈ రోడ్డులో ప్రమాదాలను నివారించే క్రమంలో ఇక్కడ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాలని 2005 - 2010 మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రానికి ప్రతిపాదన పంపించింది. ఇప్పుడు ఆ పనులకు ఆమోదం పలికింది. రూ.920 కోట్లతో ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయించింది. పది కిలోమీటర్ ఘాట్‌లో ఈ సొరంగ మార్గాన్ని ఎనిమిది కిలోమీటర్ల వరకు చేపట్టనున్నారు. బ్రిటిష్ కాలంలో గువ్వలచెరువు వద్ద పాలకొండలు దాటుతూ ఈ పెద్ద ఘాట్ రోడ్డు ఏర్పాటు అయింది. ఈ మార్గంలో చిత్తూరు, తమిళనాడు, కోయంబత్తూరు, రామేశ్వరం మార్గాల నుంచి కడప, కర్నూలు మీదుగా హైదరాబాద్‌కు వేల సంఖ్యలో వాహనాలు వెళుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వార్షిక ప్రణాళికలో ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిధులు కేటాయించారు. ఇక్కడ కొండను తొలిచి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇంజినీరింగ్ నిపుణులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి కొండ భాగం పటిష్టత, సొరంగం ఏర్పాటు చేసేందుకు ఎత్తుపల్లాలను పరిశీలించి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి అందించారు.
కడప- అనంత రోడ్డు నాలుగు వరుసలు
కడప జిల్లాలో మరో జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. కడప- అనంతపురం రోడ్డులోని ముద్దనూరు నుంచి కడప వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక రూ.1182 కోట్లు నిధులు కేటాయించింది.ఈ మార్గంలో 48 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ పనులు పూర్తయితే కడప, అనంతపురం, గుంతకల్లు మార్గంలో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వాహనదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
రూ.19,320 కోట్లతో ఎక్స్‌ప్రెస్ హైవే
కేంద్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి విజయవాడకు నూతన రోడ్డును ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మాణం పనులు చేపట్టింది. ఈ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రూ.19,320 కోట్లతో ఈ పనులు పూర్తి చేయనున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 11 జిల్లాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు నడిచే సామర్థ్యంతో ఈ రోడ్డు పనులు నిర్మిస్తారు. 2026 -2027 సంవత్సరాలు నాటికి దీన్ని పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బెంగళూరు విజయవాడను కలుపుతూ సాగే రోడ్డు 518 కి.మీ పొడవు ఉంటుంది. ఈ రోడ్డు కర్ణాటకలోని మూడు జిల్లాలు, ఏపీ 8 జిల్లాల్లో వెళ్తుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా కోడికొండ వద్ద గల ప్రస్తుత జాతీయ రహదారి 44 కిలోమీటర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మార్గంలో ప్రధానంగా సత్యసాయి, కడప జిల్లా ఉంటాయి. చివరగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల మీదుగా సాగుతుంది. ఎక్కడ మలుపులు ఉండవు, కొండలు, గుట్టలు ఉన్నా కూడా వాటిని తొలిచి నేరుగా నిర్మాణం చేపడుతున్నారు.
కడప, తిరుపతి మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే
ప్రపంచ రాజధానిగా పేరుగాంచిన తిరుమలకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులు వస్తుంటారు. అందుకే దీన్ని ప్రపంచ రాజధానిగా కూడా పిలుస్తారు. తిరుపతికి కడప మీదుగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. అంతేకాదు తిరుపతి, చెన్నై, హైదరాబాద్, ముంబైలకు కూడా ఈమార్గాన రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం డబుల్ రోడ్డుగా ఇక్కడ రహదారి ఉంది. ఇది కాకుండా ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా వివిధ పనులకు సంబంధించి సుమారు 4 వేల కోట్ల రూపాయలతో నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పనులు మంజూరు చేసింది. దీంట్లో రోడ్డు ప్రాజెక్టుకు 2350 కోట్ల రూపాయలతో అంచనా వేసింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. 130 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డు నిర్మించనున్నారు. ఇందులో సుమారు 31 కిలోమీటర్‌లు వన్యప్రాణులు సంచరించే ప్రాంతం కావడంతో మొదట్లో అటవీ శాఖ దీనికి అభ్యంతరం తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంలోని జాతీయ వన్య ప్రాణుల సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించడంతో వణ్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా భూగర్భ బ్రిడ్జిల నిర్మాణం పెట్టే విధంగా ఈ పనులకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ పనులు త్వరితగతిన సాగే అవకాశాలు ఏర్పడ్డాయి. వీటితోపాటు చిత్తూరు, కర్నూలు, అనంతపూరం జిల్లాల్లో మరికొన్ని చోట్ల కూడా హైవేల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీమ జిల్లాల్లో ఇలా రోడ్ల అభివృద్ధి, విస్తరణ, కొత్త హైవేల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు సీమ అభివృద్ధికి కూడా ఈ రోడ్లు ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు.






