అరసవల్లిలో కొనసాగుతున్న రథసప్తమి వేడుకలు

by Thanuru Gopichand |

సూర్యనారాయణుడి దర్శనం కోసం తరలిరానున్న భక్త జనులు.

అరసవల్లిలో కొనసాగుతున్న రథసప్తమి వేడుకలు
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి (Arasavelli) శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి (Ratha Saptami) వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆదిత్యుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు అర్ధరాత్రి 12:05 గంటలకు రథసప్తమి తొలిపూజలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర వేడుకలో భాగంగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి మూలవిరాట్‌కు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా క్షీరాభిషేకం (Ksheerabhishekam) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి విశేష నిజరూప దర్శనం కల్పించనున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఈ క్షేత్రంలో సూర్యభగవానుడు స్వర్ణాభరణ అలంకృతుడై భక్తులకు సాక్షాత్కరించనున్నారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తులను అలరించేందుకు భారీస్థాయిలో సాంస్కృతిక ప్రదర్శనలను అధికారులు ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ కళావేదికలో ప్రసిద్ధ సురభి నాటక ప్రదర్శనలు, ఆర్ట్స్ కళాశాల, కోడి రామ్మూర్తి క్రీడా మైదానాల్లో వివిధ కళారూపాల ప్రదర్శనలు జరగనున్నాయి. అలాగే ఎన్టీఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల మైదానంలో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఆకాశ వీధిలో విహరించేలా హెలికాప్టర్ రైడ్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాలకు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు, తాగునీరు, భద్రతా పరమైన అన్ని చర్యలను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

Next Story