ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీ జిల్లాలకు వర్షసూచన

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-20 14:00:38  IST  )

ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో జల్లులలతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీ జిల్లాలకు వర్షసూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పై ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ మరో 24 గంటల వరకూ ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ వెల్లడించారు. పశ్చిమ బంగాళాఖాతం, సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ ఎత్తులో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో కూడా జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందన్నారు. అకాలవర్షాలు, ఈదురుగాలులు ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పంటల కోతలు పూర్తచేసినవారు.. పంటను పొలాల్లోనే ఉంచకుండా సేఫ్ గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం తర్వాత అల్పపీడనం అవుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని, త్వరలోనే దానిపై క్లారిటీ వస్తుందని వెల్లడించారు. కాగా.. రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు మామిడి, మినుము, వరి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. పంట కొద్దిరోజుల్లో చేతికి వస్తుందనగా అకాల వర్షాలు దెబ్బతీశాయంటూ రైతులు వాపోతున్నారు. తమకు ప్రభుత్వాలే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

రేపు ఈ జిల్లాల్లో పిడుగులు

రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కొనసాగుతుందని #APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో పొలంలో ఉండరాదన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు.

Next Story