​సంక్రాంతి వేళ ఏపీకి వర్ష సూచన

by Thanuru Gopichand |

అకాల వర్షాలతో ప్రజలు పరేషాన్!!

​సంక్రాంతి వేళ ఏపీకి వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో (Bay Of Bengal) కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) పలు జిల్లాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని దాటి పశ్చిమ దిశగా కదులుతోందని పేర్కొంది. దీని అనుబంధ ప్రభావం వల్ల రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. అక్కడక్కడా జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగకు ముందు వస్తున్న ఈ మార్పులతో రైతులు తమ కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

​మరోవైపు ఈ వాయుగుండం ప్రభావం సంక్రాంతి (Sankranthi) పండుగ సంబరాలపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాల వల్ల పండుగ వాతావరణం కొంత మందగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర గాలుల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరగగా, ఇప్పుడు వర్షాలు తోడవ్వడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లే ప్రయాణికులు కూడా వర్ష సూచనను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఏపీలోని ఇతర జిల్లాల్లో పొడి వాతావరణం ఉన్నప్పటికీ, దక్షిణ జిల్లాల్లో మాత్రం ఈ వారం వానలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story