- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతికి కేంద్రం అండ: పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు....

దిశ, ఏపీ బ్యూరో: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ మద్దతును కేంద్రం అందిస్తూ వస్తోందని పేర్కొన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి తొలి విడతగా రూ.1,500 కోట్లు విడుదల చేసిన కేంద్రం, అదనంగా అత్యవసర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని అందించినట్లు తెలిపారు. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేయడం ద్వారా ప్రాజెక్టుకు జాతీయ ప్రాధాన్యత కల్పించారని గుర్తుచేశారు. 2015 నుంచి 2018 మధ్యకాలంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, హడ్కో వంటి సంస్థల ద్వారా దాదాపు రూ.26,000 కోట్ల ఆర్థిక సహకారం అందించడంలో కేంద్రం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఈ నిధులతో రహదారులు, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినట్లు చెప్పారు. అలాగే ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల ఏర్పాటుకు కూడా కేంద్రం తోడ్పాటు అందించిందన్నారు.
2019 నుంచి 2024 వరకు రాజధాని పనులు మందగించినప్పటికీ, 2024లో కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి అభివృద్ధికి మళ్లీ వేగం వచ్చిందని మాధవ్ పేర్కొన్నారు. 2024-25 కేంద్ర బడ్జెట్‌లో రూ.15,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని తెలిపారు. అలాగే ప్రపంచ బ్యాంకు ద్వారా సుమారు రూ.13,600 కోట్ల రుణాన్ని కేంద్రం గ్యారెంటీతో సమకూర్చగా, తొలి విడతగా రూ.4,200 కోట్లు విడుదలైనట్లు చెప్పారు. ఇక సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,458 కోట్లు, నివాస సముదాయాల కోసం రూ.1,329 కోట్లు నేరుగా కేంద్ర నిధుల ద్వారా మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.43,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అమరావతిపై కేంద్రం ఉన్న ప్రాధాన్యతను చాటిచెప్పారని అన్నారు.
రాజధాని భవిష్యత్తుపై అనిశ్చితి తొలగించేందుకు 2026 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఉభయ సభలు “అమరావతి లీగలైజేషన్ బిల్లు”ను ఆమోదించాయని తెలిపారు. ఈ బిల్లుతో అమరావతికి శాశ్వత చట్టబద్ధత లభించిందని, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధాని విధానంలో మార్పులు చేయలేని విధంగా కేంద్రం చర్యలు తీసుకుందని వివరించారు. “డబుల్ ఇంజిన్” ప్రభుత్వంతో అమరావతి అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకుంటోందని పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు.






