- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో నేడు పల్స్ పోలియో | 54 లక్షల మంది చిన్నారులే లక్ష్యం!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం అత్యంత భారీ స్థాయిలో ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా నేడు పల్స్ పోలియో (Pulse Polio) కార్యక్రమం అత్యంత భారీ స్థాయిలో ప్రారంభమైంది. ఐదేళ్లలోపు వయసున్న ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయడం ద్వారా రాష్ట్రాన్ని పోలియో రహితంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 54.07 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖ ఈ బృహత్తర కార్యక్రమం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 38,267 పోలియో బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం 61.26 లక్షల వ్యాక్సిన్ డోసులను అన్ని జిల్లాలకు ఇప్పటికే సరఫరా చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఈ బూత్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణాల్లో ఉన్న చిన్నారుల కోసం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మరియు పర్యాటక ప్రాంతాల్లో 1,140 ట్రాన్సిట్ బూత్‌లను కూడా అందుబాటులోకి తెచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలోని ప్రధాన కూడళ్లు, యాత్రీకుల వసతి గృహాల వద్ద కూడా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం.
ఈ కార్యక్రమంలో సుమారు 39,494 మంది ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాలుపంచుకుంటున్నారు. సుదూర ప్రాంతాలు, మురికివాడలు, భవన నిర్మాణ ప్రాంతాలు, వలస కూలీలు నివసించే చోట్ల ఉన్న చిన్నారులను కవర్ చేయడానికి 1,854 మొబైల్ బృందాలను రంగంలోకి దించారు. ఏ బిడ్డ కూడా పోలియో బారిన పడకుండా ఉండటమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. "మన బిడ్డల భవిష్యత్తు - మన బాధ్యత" అనే నినాదంతో ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు కోరుతున్నారు.
ఆదివారం బూత్‌లకు వచ్చి చుక్కలు వేయించుకోలేని చిన్నారుల కోసం రేపు (సోమవారం), ఎల్లుండి (మంగళవారం) ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇళ్లకు వెళ్లనున్నారు. ఇంటింటికీ తిరిగి ఏవైనా కారణాల వల్ల చుక్కలు వేయించుకోని చిన్నారులను గుర్తించి వారికి టీకా వేయనున్నారు. చుక్కలు వేసిన ఇళ్లకు ‘P’ అని, మిగిలిపోయిన ఇళ్లకు ‘X’ అని మార్కింగ్ చేస్తూ వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. పక్క దేశాల్లో ఇప్పటికీ పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, అప్రమత్తంగా ఉండి మన రాష్ట్రాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.






