జగన్ మాజీ పీఏ, వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-15 06:21:13  IST  )

సీఎం చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టించిన కేసులో వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టయ్యారు.

జగన్ మాజీ పీఏ, వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టింగ్‌లు పెట్టిస్తున్నారనే ఆరోపణలతో పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడి చేతిలో కత్తి ఉన్నట్లుగా యానిమేషన్ ద్వారా రూపొందించిన పోస్టింగ్‌లను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసినట్లు శ్రీహరిపై చిత్తూరులో కేసు నమోదైంది. ఈ పోస్టింగ్‌లు ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులు అందడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులు శ్రీహరి వద్ద ఉన్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డిజిటల్ సాక్ష్యాల ద్వారా సదరు యానిమేషన్ పోస్టింగ్‌ల వెనుక ఉన్న మూలాలను, ఇతర కీలక సమాచారాన్ని సేకరించే పనిలో చిత్తూరు పోలీసులు నిమగ్నమయ్యారు. వీటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు కూడా పంపనున్నట్లు తెలుస్తోంది.

రాజకీయ దుమారం..

శ్రీహరి అరెస్ట్‌ను వైఎస్సార్సీపీ శ్రేణులు ఖండిస్తున్నాయి. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలను, పార్టీ నేతలను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు.. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టేలా, ముఖ్యమంత్రిని కించపరిచేలా వ్యవహరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. కాగా.. జగన్ ప్రభుత్వ హయాంలో సీపీఆర్‌వోగా పనిచేసిన శ్రీహరి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.

వెల్లంపల్లి శ్రీనివాస్‌ అనుచరుడి కీచకపర్వం.. నగ్న ఫొటోలతో వివాహితపై వేధింపులు

Next Story