మంగళగిరిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్..ఏకంగా 5 కోట్లతో

by velandi.Saikiran |   (  Updated:2026-02-16 21:30:28  IST  )

ప్రజారోగ్య అత్యవసరలను ఎదుర్కొనేందుకు మంగళగిరికేంద్రంగా రూ.5 కోట్లతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీఆపరేషన్ సెంటర్ సిద్ధమైంది.

మంగళగిరిలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్..ఏకంగా 5 కోట్లతో
X

మంగళగిరిలో రూ.5 కోట్లతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్

- అంటు వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, విపత్తు ఘటనలపై నిరంతర నిఘా

- బాధితులకు సత్వరం సేవలు అందేలా శాఖలతో సమన్వయo

- హైస్పీడ్ డేటా ట్రాన్సఫర్, అత్యాధునిక సౌకర్యాల కల్పన

- వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మంగళగిరి కేంద్రంగా రూ.5 కోట్లతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల ప్రబలింపు, ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు, కోవిడ్ వంటి అసాధారణ పరిస్థితుల సమయంలో తక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకంగా పనిచేస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముందస్తు హెచ్చరికలు, నివారణ చర్యలు చేపట్టేందుకు ఈ కేంద్రం ద్వారా నిరంతర నిఘా కొనసాగించబడుతుందన్నారు. బాధితులకు సత్వర వైద్య సేవలు అందేలా వైద్య శాఖతో పాటు విపత్తు నిర్వహణ, అగ్నిమాపక, పోలీసు తదితర శాఖలతో సమన్వయం చేపడతారన్నారు. వాతావరణ శాఖ నుంచి వచ్చే హెచ్చరికలను కూడా పరిగణనలోకి తీసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని అన్నారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖలో ఇప్పటికే ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పనిచేస్తుండగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ కొత్త కేంద్రం అత్యవసర సమయాల్లో వైద్య సేవల సమన్వయంపై దృష్టి సారిస్తుందని వివరించారు.

మూడు సూత్రాల ఆధారంగా..

వాచ్–రెస్పాన్స్–అలర్ట్ సూత్రాల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించబడతాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సీనియర్ సర్వైలెన్స్ అధికారి ఆధ్వర్యంలో సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులతో అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో స్టూడియో, హైస్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్, వాయిస్ అండ్ వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. గత ఏడాది జనవరి 21న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌తో జరిగిన ఒప్పందం మేరకు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయ మూడో అంతస్తులో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన హెచ్ఎల్ఎల్ ఏజెన్సీ ద్వారా ఈ పనులు జరుగుతున్నాయని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద తొలి విడతలో 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి కమాండ్ సెంటర్ల ఏర్పాటు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Next Story