ఏఎంఆర్‌ సంస్థపై కార్మికుల తిరుగుబాటు: చెక్ పోస్ట్ ధ్వంసం, ఉద్రిక్తత

by Thanuru Gopichand |

​ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఏఎంఆర్ (AMR) సంస్థ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు, స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీవ్ర స్థాయిలో తిరుగుబాటుకు దిగారు.

ఏఎంఆర్‌ సంస్థపై కార్మికుల తిరుగుబాటు: చెక్ పోస్ట్ ధ్వంసం, ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్ : ​ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఏఎంఆర్ (AMR) సంస్థ అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా కార్మికులు, స్థానిక గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమాన్యం తీవ్ర స్థాయిలో తిరుగుబాటుకు దిగారు. అడ్డగోలుగా జరుగుతున్న వసూళ్లపై ఆగ్రహంతో ఆందోళనకారులు ఏఎంఆర్ సంస్థకు చెందిన చెక్ పోస్ట్ కంటైనర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఆకస్మిక ఘటనతో వేమవరం (Vemavaram) ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

​వేమవరం వద్ద ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి ఏఎంఆర్ పేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కార్మికులు, ఫ్యాక్టరీల యాజమాన్యం కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వసూళ్లకు వ్యతిరేకంగా గ్రానైట్ మైనింగ్ చేసే సంస్థలు దాదాపు 45 రోజుల బంద్ ను కూడా పాటించారు. చర్చల అనంతరం బంద్ ను విరమించుకొని కార్యకలాపాలను ప్రారంభించారు. అయితే సమస్య మళ్లీ తలతెత్తడంతో కార్మికులు నిరసనకు దిగారు. తమ పొట్ట కొట్టేలా పన్నులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. దీంతో ఏఎంఆర్ చెక్ పోస్ట్ వద్దకు కార్మికులు చేరుకున్నారు. వసూళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే, కంటైనర్‌ను చుట్టుముట్టి ధ్వంసం చేశారు. కార్మికుల తిరుగుబాటుతో ఆ ప్రాంతంలో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.

​ఈ నిరసనకు రాజకీయ మద్దతు కూడా లభించడంలో వివాదం అగ్గి రాజుకుంది. ఏఎంఆర్‌ సంస్థ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం ఆందోళనలో పాలుపంచుకున్నారు. ఏఎంఆర్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డగోలు వసూళ్లను తక్షణమే నిలిపివేయాలి అని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ​సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కార్మికులు, యాజమాన్యం, ప్రతిపక్ష పార్టీ కలిసికట్టుగా ఏఎంఆర్‌ సంస్థపై చేపట్టిన ఈ నిరసన.. ప్రకాశం జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది.

Next Story