ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్

by Thanuru Gopichand |

అద్దంకి (Addanki) నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.. మంత్రి గొట్టిపాటి రవికుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : అద్దంకి (Addanki) నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర ఇంధన శాఖా మంత్రి, అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో స్థానికంగా పరిపాలన మరింత పటిష్టం అవుతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

​అద్దంకిలో జరిగిన ఒక అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు, అద్దంకిని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించడం ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై ఉన్న ప్రత్యేక దృష్టికి నిదర్శనమని అన్నారు. ఈ నిర్ణయం ద్వారా అద్దంకి ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కారం కాని ఈ అంశాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు నేటి ప్రభుత్వం గౌరవించడం అభినందనీయమన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రజలు స్పష్టంగా వ్యక్తం చేసిన అభిలాషను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

​పునరుత్పాదక శక్తి పార్కు ఏర్పాటుపై ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంపై దృష్టి సారించిందని తెలిపారు. రాష్ట్రంలో నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా అద్దంకి నియోజకవర్గంలో పునరుత్పాదక శక్తి పార్కు (Renewable Energy Park) ఏర్పాటుకు త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. ​ఈ పార్కు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, రాష్ట్రానికి అవసరమైన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిలో అద్దంకి కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఎనర్జీ క్యాపిటల్‌గా మారుతుందన్నారు. అందులో అద్దంకి నియోజకవర్గం నుంచి ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.

Next Story