Prakasam | ముటుకుల పంచాయతీ నిధులు గోల్ మాల్

by Thanuru Gopichand |   (  Updated:2025-11-22 04:34:00  IST  )

పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామపంచాయతీ అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నుంచి 21 లక్షల మంజూరయ్యాయి.

Prakasam | ముటుకుల పంచాయతీ నిధులు గోల్ మాల్
X

దిశ, ఎర్రగొండపాలెం : పుల్లలచెరువు మండలం ముటుకుల గ్రామపంచాయతీ అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నుంచి 21 లక్షల మంజూరయ్యాయి. అందులో రూ.16 లక్షలు సెక్రటరీ గుర్రం ఉదయ్ కిరణ్ సర్పంచ్ గాడి కొయ్య కోటమ్మ తెలియకుండా మళ్లించుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు జిల్లా పంచాయతీరాజ్ అధికారికి సర్పంచ్ ఫిర్యాదు చేశారు. ఆ నిధులతో ముటుకుల తెల్లగట్లలో అక్కడక్కడ మట్టి కుప్పలు పోసి, డోజర్ సహాయంతో చదును చేసి, మట్టి రోడ్డు నిర్మించినట్లుగా పేర్కొంటూ నిధులను అదే గ్రామానికి చెందిన మెకానిక్ గద్దె వెంకటేశ్వర్లు పేరుమీద 13. 66 లక్షల రూపాయలను మళ్లించినట్లు సర్పంచ్ ఆరోపించారు. మిగతా 3 లక్షలు లెక్కల్లో కనిపించడం లేదని ఫిర్యాదులో తెలిపారు. ఐదు లక్షలు మాత్రమే పంచాయతీ ఖాతాలో కనిపిస్తున్నాయని సర్పంచ్ తెలియజేశారు. గతంలో పుల్లలచెరువు మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహించిన రిటైర్డ్ టి నాగప్ప పేరుతో తప్పుడు ఎం బుక్కులను సెక్రటరీ ఉదయ్ కిరణ్ సృష్టించారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఫోర్జరీ సంతకాలతో చెయ్యని పని చేసినట్లుగా లెక్కల్లో చూపించారనే విమర్శలు వస్తున్నాయి. అలా మళ్లించిన నిధులను గద్దె వెంకటేశ్వర్లు వ్యక్తిగత బ్యాంకు ఖాతాకులో వేశారని సర్పంచ్ గాడి కొయ్య కోటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుస్తోంది. డిఎల్డివో సుబ్బారావు శుక్రవారం పంచాయతీ సెక్రటరీ సమక్షంలో రికార్డులు తనిఖీ చేశారు. ఆయనను దిశ వివరణ కోరగా సర్పంచి వివరణ, సెక్రటరీ వివరణ తీసుకుంటామన్నారు. రికార్డులు పరిశీలించి నివేదికను పై అధికారులకు అందిస్తామని తెలిపారు.

Next Story