- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెజవాడ దుర్గ గుడికి పవర్ కట్ బాధాకరం: విద్యుత్ శాఖ తీరుపై చైర్మన్ రాధాకృష్ణ ఆగ్రహం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి విద్యుత్ సరఫరా నిలిపి వేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయానికి (Kanakadurgamma Temple) విద్యుత్ సరఫరా (Power supply) నిలిపి వేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. కాగా ఈ షాకింగ్ ఘటనపై దుర్గ గుడి చైర్మన్ రాధాకృష్ణ తీవ్రంగా స్పందించారు. దేవస్థానం తరపున విద్యుత్ బకాయిలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే, ముందస్తు సమాచారం లేకుండా ఇలా కరెంట్ కోత విధించడం అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఆలయ యాజమాన్యం రెండు నెలల క్రితం కొంతమేర బకాయిలు చెల్లించిందని, ఈ నెల 23వ తేదీన కూడా తాము విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడామని ఆయన వెల్లడించారు. చర్చలు జరుగుతున్న దశలోనే అధికారులు ఇలాంటి తొందరపాటు చర్యలకు దిగడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
దేవస్థానానికి సంబంధించిన అప్పారావుపేట సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజూ దాదాపు 24 మెగావాట్ల విద్యుత్తును తాము విద్యుత్ మండలికి (గ్రిడ్) అందిస్తున్నామని చైర్మన్ వివరించారు. తమ నుంచి వెళుతున్న విద్యుత్తుకు ప్రతిగా ఆలయానికి సంబంధించిన సర్వీసులకు రాయితీ లేదా సర్దుబాటు ఉండాలని, ఆ విషయమై మాట్లాడుతున్న సమయంలోనే సరఫరా నిలిపివేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ నిలిపివేసినప్పటికీ, భక్తులకు ఇక్కడ ఆటంకం కలగకుండా జనరేటర్ల ద్వారా దర్శనాలు, నిత్య కార్యక్రమాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలని చైర్మన్ రాధాకృష్ణ కోరారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి తక్షణమే ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, దుర్గగుడికి దాదాపు రూ. 3.08 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, పదే పదే నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడం వల్లే తాము ఈ చర్య తీసుకున్నామని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు తమ వాదనను వినిపిస్తున్నారు. అయితే, పుణ్యక్షేత్రం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇలా వ్యవహరించడంపై భక్తుల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






