చిన్నారి జాను మిస్సింగ్ కేసు.. కుక్కకు పోస్టుమార్టం పూర్తి!

by Naga Rani Yarlagadda |

తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సింగ్ కేసులో చిక్కుముడి ఇంకా వీడలేదు.

చిన్నారి జాను మిస్సింగ్ కేసు.. కుక్కకు పోస్టుమార్టం పూర్తి!
X

దిశ, వెబ్‌డెస్క్: తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి మిస్సింగ్ కేసులో చిక్కుముడి ఇంకా వీడలేదు. 9 రోజులవుతున్నా ఈ కేసులో చిన్న క్లూ కూడా దొరక్కపోవడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. జానుతోపాటే వెళ్లిన పెంపుడు కుక్క ఐదురోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చినా.. అది వింతగా ప్రవర్తించడం, మనుషులను చూస్తే భయపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జీపీఎస్ ట్రాకర్ పెట్టి అడవిలో వదిలినా.. 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు తిరిగి వెనక్కి వచ్చేసింది. ఎవరిని చూసినా భయపడుతున్న కుక్కను బోనులో ఉంచగా.. అనూహ్యంగా నిన్న మరణించింది. తాజాగా ఆ కుక్క భౌతికకాయానికి తుని మండలం ఎన్. సురవరం పశువైద్యశాలలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుక్క శరీర భాగాలను బాధిత కుటుంబానికి అప్పగించారు. పోస్టుమార్టం నమూనాలను పోలీసులు విశాఖ ల్యాబ్ కు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఏం తేలుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు చిన్నారి జాను ఆచూకీని కనుగొనేందుకు నేడు ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రిలీఫ్ ఫోర్సులు రంగంలోకి దిగాయి. ఈ కేసును స్వయానా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దర్యాప్తుకు సంబంధించిన విషయాలను అధికారులు ఆయనకు అందిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా తిరిగిరావాలని స్థానికులతో పాటు.. తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story