- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలంలో శివస్వాములపై పోలీసుల లాఠీ ఛార్జ్.. స్పందించిన మాజీ మంత్రి రోజా
శ్రీశైలంలో సోమవారం శివస్వాములపై పోలీస్ లాఠీ ఛార్జ్ చేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీశైలంలో సోమవారం శివస్వాములపై పోలీస్ లాఠీ ఛార్జ్ చేయడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా సెల్వమణి స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘దేవుడంటే భయం లేదు, భక్తులంటే గౌరవం లేదు, ఈ రాక్షస పాలనలో ఆలయాలకు రక్షణే లేదు, అసలు భక్తికి విలువలేదు, రౌడీమూకల అరాచకాలను చోద్యం చూసిన పోలీసులు.. శ్రీశైలంలో మాలవేసుకొన్న శివస్వాములు, సామాన్య భక్తులపై మాత్రం లాఠీలు జులడం హేయమైన చర్య, మాలవేసుకొని దీక్షలో ఉన్న శివస్వాములను శ్రీశైలం ఆలయం వద్ద లాఠీలతో కొడుతున్న పోలీసుల తీరు బాధాకరం, ఇది రాక్షస పాలనకు నిదర్శనం’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
వైసీపీ నాయకుల ఇండ్లపై రౌడీమూకలు దాడి చేసినప్పుడు, పెట్రోల్ బాంబులు విసిరినప్పుడు, కార్లు, ఇండ్లు ధ్వంసం చేసినప్పుడు లేవని లాఠీలు ఇప్పుడు ఎందుకు లేస్తున్నట్లో అని ప్రశ్నించారు. రౌడీలు, గూండాలు అరాచకాలు సృష్టిస్తుంటే చేతులు ముడుచుకొని చేతగాని దద్దమ్మల్లా చోద్యంచూసిన పోలీసులు.. ఇప్పుడు సామాన్య భక్తులపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు.. లాఠీలతో చావ బాదుతున్నారని మండిపడ్డారు. రౌడీలంటే భయమా? లేక వారు పచ్చ పార్టీ వాళ్ళన్న గౌరవమా? గూండాలకున్న విలువకూడా భక్తులకు లేదా? ఇదేనా పాలన అంటే? ఇదేనా పోలీసు రాజ్యం అంటే? రౌడీలముందు చేతగాని దద్దమ్మల్లా నిల్చొని, నిష్టతో వచ్చే భక్తులపై మాత్రం కర్కశంగా ప్రవర్తించడం సిగ్గుచేటైన విషయం.. అని రోజా పేర్కొన్నారు.
పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా తయారవడానికి ప్రభుత్వ తీరే కారణం అని ఆరోపించారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, ఇకనైనా పోలీసులు ప్రజలకోసం పనిచేయాలని, పాలకులకు ఊడిగంచేయడం మానాలని సూచించారు. సనాతన ముసుగులో నటించడం కాదు.. దేవుడి పేరు చెప్పి బ్రష్ట రాజకీయాలు చేయడం కాదు.. నిజమైన భక్తులను గౌరవించడం నేర్చుకోండని హితవు పలికారు.






