IFR, మిలాన్ కార్యక్రమాలు.. ఆర్కే బీచ్ రోడ్డులో రెండ్రోజులు నో ఎంట్రీ

by Naga Rani Yarlagadda |

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026, మిలాన్ కార్యక్రమాల నేపథ్యంలో ఆర్కే బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు.

IFR, మిలాన్ కార్యక్రమాలు.. ఆర్కే బీచ్ రోడ్డులో రెండ్రోజులు నో ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR), మిలాన్ కార్యక్రమాలకు ఆర్కే బీచ్ రోడ్డు వేదిక కానుంది. ఫిబ్రవరి 18,19,20 తేదీల్లో జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా రిహార్సల్స్ జరుగుతున్నాయి. రేపు, ఎల్లుండి బీచ్ రోడ్డులో సన్నాహక విన్యాసాలు జరగనుండటంతో.. పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బీచ్ రోడ్డువైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. బీచ్ రోడ్డులో నివసించే ప్రజలకు కూడా ప్రత్యేక సూచనలు చేశారు. పాస్ లు లేని వాహనాలకు ఈనెల 18,19 తేదీల్లో ఎంట్రీ ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని కోరారు.

విశాఖ బీచ్ లో ప్రపంచ యుద్ధనౌకల ప్రదర్శనకు భారత నౌకాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. శనివారం నుంచే వివిధ దేశాల నుంచి నౌకలు వస్తున్నాయి. 18న ఫ్లీట్ రివ్యూ, 19న మిలాన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, 20న ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం - కాన్ క్లేవ్ ఆఫ్ చీఫ్స్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు విచ్చేయనున్నారు. 18న ఫ్లీట్ రివ్యూలో పాల్గొని భారత నౌకాదళ ప్రదర్శనలను వీక్షిస్తారు. ఈ ఫ్లీట్ రివ్యూలో 70 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొననుండటం విశేషం. 2016లో జరిగిన ఫ్లీట్ రివ్యూలో 51 దేశాలు పాల్గొన్నాయి. ఇక మిలాన్ కార్యక్రమంతో మిత్రదేశాల నౌకాదళాలు కలవనున్నాయి. దేశాల నౌకాదళాల మధ్య సమన్వయం, స్నేహపూర్వకమైన సంబంధాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. భారతి 137 దేశాలను ఆహ్వానించగా.. 70 దేశాలు హాజరుకానున్నాయి.

Next Story