Byreddy Siddharth Reddy : వైసీపీకి మరో షాక్.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-20 04:52:55  IST  )

వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదైంది.

Byreddy Siddharth Reddy : వైసీపీకి మరో షాక్.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కర్నూల్ లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని కర్నూల్ త్రీ టౌన్ సీఐ శేషయ్య ధృవీకరించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూల్ ఎమ్మెల్యే టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మే 14వ తేదీన కర్నూల్ కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి టీజీ భరత్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీజీ భరత్ 48 సంవత్సరాల వయసులో మంత్రి అయ్యారని, కానీ తాను 43 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా పోటీ చేశానన్నారు. ఇప్పుడు ఆయన వయసు 50 సంవత్సరాలు అని, ఆయన వయసులో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే అడగాలని బైరెడ్డి విమర్శించారు. టీడీపీ నాయకుల వేధింపులతోనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రిహోదాలో ఉన్న టీజీ భరత్ సతీష్ కుటుంబానికి న్యాయం చేయకుండా.. బైరెడ్డిని తిట్టినోళ్లకు రూ.10 వేలు, సెల్ఫీ వీడియో చేసినవాళ్లకు రూ.20 వేలు, ప్రెస్ మీట్ పెట్టినోళ్లకు కార్పొరేటర్ సీటు, ఇంటిమీద దాడిచేస్తే స్టోర్ బియ్యం ఇవ్వడం వంటివి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించడమే కాకుండా.. ప్రజలను భయపెట్టారని మంత్రి భరత్ పేర్కొన్నారు. మంత్రి ఫిర్యాదు మేరకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story