- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి ఆలోచించండి.. రాయచోటికి న్యాయం చేయండి
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన (District Re-organziation) సెగ మరోసారి రాజుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన (District Re-organziation) సెగ మరోసారి రాజుకుంది. 2022 ఏప్రిల్ 4న వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాకు (Annamayya District) కేంద్రంగా రాయచోటిని (Rayachoti) ప్రకటించారు. అప్పటి నుంచి జిల్లా యంత్రాంగం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వంటివన్నీ ఇక్కడే కొలువుదీరాయి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లాల సరిహద్దుల్లో చేస్తున్న మార్పులు రాయచోటి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాయనే ఆందోళనలు రాయచోటివాసుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని.. రాయచోటికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రజల నుంచి ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు విన్నవిస్తుండగా మరికొందరు ఆందోళనలకు దిగుతున్నారు. మరోసారి ఈ అంశాన్ని సమీక్షించాలని సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ను వేడుకుంటున్నారు. కూటమి నేతలు సైతం ప్రజలకు మద్ధతుగా తమ గళాన్ని విప్పుతున్నారు.
చారిత్రక.. భౌగోళిక ప్రాముఖ్యత
రాయచోటి కేవలం ఒక పట్టణం మాత్రమే కాదని, రాయలసీమలో అత్యంత ప్రాచీనమైన ప్రాంతాలలో ఒకటని నివాసితులు పేర్కొంటున్నారు. సుమారు వేయి ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందన్నారు. అంతేకాకుండా మాండవ్య నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత పొందిందంటున్నారు. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇది పరిపాలనా పరంగా అనుకూలమైన కేంద్రంగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
రాజకీయ సంక్షోభం
సోమవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మదనపల్లెను అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. రాయచోటి ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తన నియోజకవర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన సీఎం చంద్రబాబును కోరారు. ప్రభుత్వ నిర్ణయంతో రాయచోటీలో జేఏసీ (JAC) ఆధ్వర్యంలో స్థానికులు, విద్యార్థులు, వ్యాపారులు భారీ ర్యాలీలు నిర్వహించారు. "మదనపల్లె వద్దు - రాయచోటి ముద్దు" అనే నినాదాలతో పట్టణ రహదారులు, వీధులను మారుమ్రోగించారు.
అభివృద్ధి - ఆటంకాలు
రాయచోటి జిల్లా కేంద్రంగా మారిన తర్వాతే ఇక్కడ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయని పట్టణవాసులు చెబుతున్నారు. కలెక్టరేట్ నిర్మాణం, మెడికల్ కాలేజీ ప్రతిపాదనలు వంటివి పట్టణ అభివృద్ధికి బాటలు వేశాయంటున్నారు. ఒకవేళ జిల్లా కేంద్రం మారిస్తే, అభివృద్ధి కుంటుపడుతుందన్నది ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా ప్రతిపాదిత రూపం
ప్రస్తుత సమాచారం ప్రకారం అన్నమయ్య జిల్లా పేరు యధావిధిగా కొనసాగనుంది. అయితే జిల్లా కేంద్రం మాత్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మారనుంది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేట వైఎస్ఆర్ కడప జిల్లాలో, రైల్వే కోడూరు తిరుపతి జిల్లాలో విలీనం కానున్నాయి.
నెలకొన్న ఉత్కంఠ
రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలనే డిమాండ్‌తో నిరసనలు ఉధృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే విషయం ఉత్కంఠగా మారింది. అభివృద్ధి చెందిన పట్టణాన్ని కేవలం ఒక నియోజకవర్గ స్థాయికి పరిమితం చేయడం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు, ప్రజల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






