- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమృత్ భారత్ స్కీమ్‌లోకి పిఠాపురం రైల్వే స్టేషన్
పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది.

అమృత్ భారత్ స్కీమ్‌లోకి పిఠాపురం రైల్వే స్టేషన్
* రూ.37.25 కోట్లతో అభివృద్ధి పనులు
* ఫలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషి
దిశ, ఏపీ బ్యూరో : పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుంది. ఈ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపాదనలకు కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. రూ.37.25 కోట్లతో స్టేషన్ లో మౌలిక వసతులు అభివృద్ధి చేయనుంది. గత పిఠాపురం పర్యటనలో పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన సందర్భంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు అశుభ్రత, దుర్గంధం వెదజల్లుతుండడాన్ని గమనించారు. తక్షణం శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు.
ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమని, దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ పిఠాపురం స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్‌గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతి గది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర పనులు చేపట్టనుంది. ఈ సందర్భంగా అడిగిన వెంటనే పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసేందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, తక్షణం స్పందించిన రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కి, పిఠాపురం అభివృద్ధికి నిరంతర మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.






