మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు

by Thanuru Gopichand |

జంట హత్యల కేసులో (Dual Murder Case) నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు (Pinnelli Brothers) నేడు కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం.

మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి సోదరులు
X

దిశ, వెబ్ డెస్క్ : జంట హత్యల కేసులో (Dual Murder Case) నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు (Pinnelli Brothers) నేడు కోర్టులో లొంగిపోనున్నట్లు సమాచారం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గురువారం మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. పల్నాడు జిల్లాలో గత మే 24న జరిగిన టీడీపీ నేతలు జె.వెంకటేశ్వర్లు, జె.కోటేశ్వరరావు జంట హత్యల కేసులో సోదరులిద్దరూ నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో మొదట హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో, వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, ఏపీ ప్రభుత్వం దానిని సవాల్ చేసింది. పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ 28న పిన్నెల్లి సోదరులకు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రద్దు చేసింది. రెండు వారాల్లోగా మాచర్ల కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో నేడు వారు మాచర్ల కోర్టుకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

​ఈ కేసులో పిన్నెల్లి సోదరుల లొంగుబాటు పల్నాడు రాజకీయాల్లో, కేసు దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా మారనుంది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది.. ఛార్జిషీట్లు దాఖలు కాకముందే నిందితులకు కేసు డైరీలోని విషయాలు, 161 స్టేట్‌మెంట్లు తెలియడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. నిందితుల పరపతి అబ్బురపరుస్తోందని, వారికి కొందరు అధికారులు కూడా అండగా ఉన్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు లొంగిపోయిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. పిన్నెల్లి సోదరులు ఇవాళ లొంగిపోనుండడంతో, ఈ జంట హత్యల కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని తెలియవస్తోంది. ఈ కేసుపై పల్నాడుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

Next Story