- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రాష్ట్రంలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరత, తద్వారా పలు బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరత, తద్వారా పలు బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళన (ప్యానిక్ బయ్యింగ్) వల్లే ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముంబై నుంచి అమరావతికి బయల్దేరే ముందు సీఎస్ సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.
అమాంతం పెరిగిన అమ్మకాలు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, ఇంధన కొరతతో సుమారు 421 బంకులు మూతపడినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చమురు సరఫరా గతంతో పోలిస్తే 10 శాతం పెరిగినప్పటికీ, కొరత వస్తుందన్న ఆందోళనతో వాహనదారులు భారీగా కొనుగోళ్లు చేస్తుండటమే ప్రస్తుత రద్దీకి కారణమని వెల్లడించారు. స్థానికంగా అమ్మకాల గణాంకాలను అధికారులు సీఎంకు వివరించారు సాధారణ రోజుల్లో.. పెట్రోల్ - 6,330 కిలో లీటర్లు /డీజిల్ - 9,048 కిలో లీటర్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. శనివారం నాడు.. పెట్రోల్ - 10,345 కిలో లీటర్లు/ డీజిల్ - 14,156 కిలో లీటర్లు అమ్మకాలు జరిగినట్లు వివరించారు. సాధారణం కంటే దాదాపు 50 శాతం అమ్మకాలు ఒకేసారి పెరగడంతో బంకుల్లో నిల్వలు అడుగంటుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఆక్వా రైతుల కోసం ప్రత్యేక చర్యలు..
ఆక్వా రైతులు డ్రమ్ముల కొద్దీ ఇంధనాన్ని కొనుగోలు చేస్తుండటంతో విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన, జిల్లా కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఆక్వా రైతులకు తక్షణమే పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలపై సాయంత్రంలోగా తనకు పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని స్పష్టం చేశారు.
చమురు సంస్థలకు మంత్రి నాదెండ్ల దిశానిర్దేశం
సీఎం ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ కన్నబాబు చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షోభ సమయంలో చమురు సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులకు అసౌకర్యం కలిగించడం సరికాదని స్పష్టం చేశారు. సరఫరాలో తలెత్తిన ఇబ్బందులను అధిగమించాల్సిన బాధ్యత కంపెనీలదేనని పేర్కొన్నారు. ఎక్కడా సరఫరాలో ఆలస్యం జరగకుండా చూడాలని, చమురు సంస్థల డిపోల వద్ద జాయింట్ కలెక్టర్లు (జేసీలు) స్వయంగా తనిఖీలు చేపట్టాలని మంత్రి నాదెండ్ల అధికారులకు సూచించారు.






