కులాల కుంపట్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు

by Thanuru Gopichand |

భోగి పండగకి డాన్సులు, దీపావళికి టపాసులు కాల్చుకోవడానికే మీ శేష జీవితం సరిపోతుంది. వైసీపీ నాయకులకు మరోసారి గెలిచే అవకాశం లేదు.

కులాల కుంపట్లు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు (YCP Leaders) డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ బోర్డు సభ్యుడు, బిజెపి నాయకుడు భానుప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ నెయ్యి కల్తీని (Adulterated Ghee) పక్కదారి పట్టించేలా కులాల కుంపట్లు పెట్టి.. ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అసభ్య వ్యాఖ్యలు చేసే నాయకులను వెనకేసుకొచ్చేలా జగన్ (YS Jagan) వ్యవహరించడం దారుణమన్నారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుమల క్షేత్రం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని అన్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకులు తిరుమల చుట్టూ ప్రదక్షిణలు వేస్తే పుణ్యం వస్తుందని.. రాజకీయాలు చేస్తే వినాశనమే మిగులుతుందని హెచ్చరించారు. ఇటువంటి కుటిల రాజకీయాల కారణంగానే ఏపీ ప్రజలు వైసీపీ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. అయినా కూడా ఆ పార్టీ నేతల్లో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదని విమర్శించారు. బుద్ధి లేకుండా స్వామివారితో రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం తయారీలో వాడింది నెయ్యి కాదు అని సిట్ రిపోర్టు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయాన్ని తప్ప మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. నెయ్యికి బదులుగా వాడింది ఏమిటో సూటిగా ఎందుకు సమాధానం ఇవ్వరు అని నిలదీశారు. తిరుమల పరకామణిలో దొంగతనం జరిగితే దాన్ని వైయస్ జగన్ చిన్న దొంగతనం అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు కుల రాజకీయాలను తీసుకొస్తున్నారన్నారు. భోగి పండగకి డాన్సులు, దీపావళికి టపాసులు కాల్చుకోవడానికే మీ శేష జీవితం సరిపోతుందన్నారు. వైసీపీ నాయకులకు మరోసారి గెలిచే అవకాశం లేదన్నారు.

ఏపీని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ డీవియేషన్ పాలిటిక్స్ చేస్తున్నారని తాము భావిస్తున్నాం అన్నారు. అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నాయకులు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. సిట్ నివేదికలో కోట్ల రూపాయలు హవాలా మార్గంలో చేతులు మారాయని పేర్కొన్నారని తెలిపారు. చిన్నప్పన్న ఎవరు? సుబ్బారెడ్డి టీటీడీ చైర్మనుగా ఉన్నప్పుడు తీర్మానంలో మార్పులు ఎందుకు తెచ్చారు? అనే వాటికి సమాధానాలు చెప్పాలన్నారు. నోటి దురుసుతో మాట్లాడి దాని వల్ల కలిగే పరిణామాలను కులాలు అంటగట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అదేదో ఘనకార్యం చేసిన వ్యక్తికి మద్ధతుగా వెళ్తున్నట్లు జగన్ గుంటూరు బయలుదేరి వెళ్లడానికి భానుప్రకాశ్ రెడ్డి తప్పుబట్టారు. ఇదంలా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు.

Next Story