రేపు అగ్నిగోళంలా మండనున్న సూరీడు.. ఈ జిల్లాల్లో 48 డిగ్రీలు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-22 12:07:45  IST  )

రాష్ట్రంలో రేపు తీవ్రమైన ఎండలు కాయనున్న క్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు చేసింది.

రేపు అగ్నిగోళంలా మండనున్న సూరీడు.. ఈ జిల్లాల్లో 48 డిగ్రీలు?
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు తీవ్రమైన ఎండలు కాయనున్న క్రమంలో విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు చేసింది. శనివారం కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గరిష్ఠంగా 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వీటితో పాటు రాష్ట్రంలో 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు 221 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నేడు (శుక్రవారం) తణుకులో అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. దేవరాపల్లి, తొర్రగుడిపాడులో 44.7 డిగ్రీలు, పిడుగురాళ్ల, కలపర్రులో 43.8 డిగ్రీలు, విశాఖ రూరల్ లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్

మరోవైపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని, రైతులు, పశువుల కాపరులు, ఉరుముల సమయంలో చెట్లకింద నిలబడకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించింది.

Next Story