వాళ్లంతా బీజేపీకి బానిసలే: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు బీజేపీకి బానిసలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు..

వాళ్లంతా బీజేపీకి బానిసలే: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పేరుకే టీడీపీ(Tdp), వైసీపీ(Ycp), జనసేన(Janasena) ఎంపీలు అని, వాళ్లంతా బీజేపీ(Bjp)కి బానిసలని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(PCC Chief YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజలే వారికి మిన్న అని ఆమె విమర్శించారు. రాష్ట్ర హక్కుల కన్నా మోడీ(Modi) మెప్పు మిన్న అని ఎద్దేవా చేశారు. పదవులు అనుభవించడంపై ఉన్న శ్రద్ధ విభజన హామీలపై లేదన్నారు. తమ నోరును హక్కుల కోసం కాకుండా మోడీ జపానికి మాత్రమే వాడతారని మండిపడ్డారు. నమ్మి ఓటేస్తే మతపిచ్చి పార్టీకి ఊడిగం తప్ప ఉద్ధరించింది శూన్యమని షర్మిల వ్యాఖ్యానించారు. మోడీ చేతిలో 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు రబ్బర్ స్టాంప్స్ గా ఉన్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలని వైఎస్ షర్మిల ఆరోపించారు.

‘‘హోదాపై అడిగే దమ్ములేదు. రాజధానికి నిధులు అడిగే సత్తా లేదు. పోలవరాన్ని ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేదు. అడ్డికి పావుసేరు కింద విశాఖ స్టీల్‌ను అమ్ముతున్నా.. పౌరుషం ఉండదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులపై గళం విప్పకుండా బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్ప... మన ఎంపీలకు ఏమి చేతకాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయండి. మోడీ మోసాన్ని ప్రశ్నించండి. హోదాపై తాడోపేడో తేల్చండి. ఢిల్లీని తలదన్నే రాజధాని ఏదని అడగండి. కేంద్రం బాధ్యతగా అమరావతికి నిధులు కాకుండా అప్పులు ఎందుకు ఇస్తున్నారో సమాధానం చెప్పమనండి. జీవనాడి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించి ఎందుకు జీవం తీశారని ఉభయ సభలను స్తంభింపజేయండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఉండదని మోడీతో అధికారిక ప్రకటన చేయించండి’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Next Story