HHVM:‘మీలోని పౌరుషం తగ్గితే.. ఆ పాట వినండి’.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-20 09:53:57  IST  )

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ(మంగళవారం) సందర్శించారు.

HHVM:‘మీలోని పౌరుషం తగ్గితే.. ఆ పాట వినండి’.. పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి స్టూడియోను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ(మంగళవారం) సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మాట్లాడుతూ.. మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడి పోకూడదు అని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే.. ‘సలసల మరిగే నీలోని రక్తమే..’ అనే పాటకు సంగీత, సాహిత్యాలతో సంగీత దర్శకుడు కీరవాణి ప్రాణం పోశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘హరిహర వీరమల్లు’లో ఈ గీతం వినిపిస్తుందని చెప్పారు. నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేజారి పోకూడదని ఈ పాటలో అద్భుతంగా వివరించారని తెలిపారు.

ఈ పాటను 50 సార్లు విన్నా. పౌరుషం తగ్గితే ఈ పాట వింటే పౌరుషం వస్తుందని అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పాటను రేపు(మే 21) అందరికీ వినిపించబోతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం, ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయని చెప్పారు. ఈ సినిమా కోసం కీరవాణి ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశానని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘వీరమల్లు’కి ప్రాణం పోశారు అంటే అతిశయోక్తి కాదు.

‘మొదటిసారి మీతో చెస్తున్నాను అంటే.. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారని.. అందుకు తగ్గట్టు ఉండాలి కదా’ అనడం కీరవాణి అంకిత భావాన్ని తెలియచేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తన జీవితాన్ని ప్రభావితం చేసిన అంశాలను కథలుగా మలిచి రాసిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కీరవాణి(Keeravani) బహుమతిగా అందించారు. ఈ తరుణంలో ‘మీరు అందుకున్న ఆస్కార్ ఎక్కడ ఉంది సార్’ అంటూ అప్యాయంగా పవన్ కళ్యాణ్ అడగటంతో కీరవాణి తన గదిలోకి వెళ్లి తీసుకొచ్చి మరీ చూపించారు. ఆ అవార్డును పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా మరోసారి కీరవాణికి అందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ విడుదల చేసింది. కీరవాణి దగ్గర ఉన్న వయోలిన్‌ను చూసి వాటి గురించి పవన్ కళ్యాణ్, కీరవాణి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ‘‘నేను వయోలిన్ నేర్చుకోవడం, జంట స్వరాలు వరకు నేర్చుకొని వదిలేయడం గుర్తు చేసుకున్నాను’’ అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలుగు కథలను ప్రేమించే కీరవాణి తనకు అమితంగా నచ్చిన 32 కథలను ఒక సంకలనంలా చేసుకున్నారు. వాటిని బహుమతిగా ఇవ్వడం తో పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Next Story