- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను కోరుకున్నది ఇదే: పవన్ కల్యాణ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘గత ప్రభుత్వంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ఇప్పుడు పెట్టుబడులు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో నేను కోరుకున్న కూటమి నేడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయి పెట్టుబడులు రావడానికి కారణమయ్యింద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘2024లో రాష్ట్ర ప్రజలకు చెప్పిన మాట ఇదే.. రాష్ట్రం బలంగా ఉండాలి.. రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలి.. అలా జరగాలి అంటే రాష్ట్రంలో దార్శనికత ఉన్న పటిష్టమైన నాయకత్వం ఉండాలని చెప్పాను. ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి’ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రూపంలో అలాంటి నాయకత్వం రాష్ట్రంలో ఉండబట్టే దేశంలో 25 శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండల పరిధిలో ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో స్థాపించనున్న గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, రాష్ట్ర, కేంద్ర మంత్రులతో కలసి పాల్గొన్నారు.
ఉక్కు కర్మాగారం భూమి పూజ అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “అనకాపల్లి జిల్లా, నక్కపల్లి మండల పరిధిలో నిర్మిస్తున్న ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా రూ.1.35 లక్షల కోట్లతో 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ భారీ కర్మాగారం ఉత్తరాంధ్ర ప్రాంత దశ దిశ మారిపోనున్నాయి. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. దేశంలోనే అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు కానున్న ఈ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ పరిమిత స్థాయి కర్బన ఉద్గారాలను విడుదల చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు రావాలి. వచ్చే పరిశ్రమలు తక్కువ మోతాదులో కాలుష్యం వెదజల్లేవిగా ఉండాలన్నది నా ఆకాంక్ష. దాన్ని ఆచరణలో పెడుతున్న ఆర్సెలర్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి తరఫున ఈ సంస్థను రాష్ట్రంలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను.
గత పాలకులు బెదిరింపులకు పాల్పడి పరిశ్రమల్ని పంపేశారు..
ఒక్క కియా పరిశ్రమతో అనంతపురం జిల్లా తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉద్యోగాలు వచ్చాయి. భూముల ధరలు పెరిగాయి. ఒక్క పరిశ్రమ వస్తే ఎన్ని మారిపోతాయో అనంతలో చూశాం. అలాంటిది రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ వస్తే ఉత్తరాంధ్ర, అనకాపల్లి ప్రాంత దశ దిశ భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. గత పాలకులు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చిన పరిశ్రమలను బెదిరించి పంపేశారు. కూటమి ప్రభుత్వంలో కేవలం 18 నెలల కాలంలో ఒక వీడియో కాన్ఫరెన్స్‌తో మొదలై రూ. 1.35 లక్షల పరిశ్రమకు భూమి పూజ చేయడం స్పీడ్ ఆఫ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిలువెత్తు నిదర్శనం.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ పారిశ్రామికవేత్తలకి సహకారం..
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Speed of Doing Business)పై దృష్టి సారించాం. పెట్టుడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించాం. అదుపు తప్పిన శాంతిభద్రతలను పునరుద్ధరించాం. రంగాలవారీగా 25కి పైగా విధానాలు తీసుకువచ్చి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారాన్ని అందిస్తున్నాం. తత్ఫలితంగా దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ లాంటి సంస్థ ఉత్తరాంధ్రని, విశాఖను వెతుక్కుంటూ వచ్చింది. అలాంటి వాతావరణం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన మిత్తల్‌కి అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను” అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, గుమ్మడి సంధ్యారాణి, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్. మాధవ్, వివిధ నియోజకవర్గాల శాసన సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.






