Pawan Kalyan : పవన్ కల్యాణ్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-02 03:33:37  IST  )

పవన్ కల్యాణ్ కీలక పిలుపు

Pawan Kalyan : పవన్ కల్యాణ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా అరికట్టి, అడవులను ఆర్థిక వనరులుగా మార్చుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలకు రూపకల్పన చేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అటవీశాఖ అధికారులకు ఆదేశించారు. అడవుల సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్(Great Green Wall) కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం అటవీశాఖ ఛీఫ్ కన్జర్వేటర్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పి.వి. చలపతిరావు, అదే హోదాలో పదవీ విరమణ చేసిన ఎ.కె. నాయక్, శిక్షణ పూర్తి చేసుకున్న ఐఎఫ్ఎస్ అధికారులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవీ విరమణ చేసిన ఎ.కె. నాయక్‌ని సత్కరించారు. పి.వి. చలపతిరావుని నూతన విధుల్లోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అడవుల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణపై కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... “రాష్ట్రంలో స్వదేశీ జాతి మొక్కల లభ్యత తక్కువగా ఉంది. సాధారణ నర్సరీల్లో ఈ మొక్కలు లభించడం లేదు. స్వదేశీ జాతి మొక్కల పెంపకాన్ని అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన గ్రామాలకు అప్పగించాలి. తద్వారా గిరిజనులకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించాలి.

ఎకో టూరిజం ద్వారా ఆర్థిక పరిపుష్టి

అడవుల ఆక్రమణలు, అక్రమ గనుల తవ్వకాలు, ఉద్దేశపూర్వకంగా అడవులకు నిప్పు పెట్టడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలి. ఎకో టూరిజం అభివృద్ధి చేయడం ద్వారా అటవీ శాఖను ఆర్థికంగా బలోపేతం చేసే అంశంపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. తీర ప్రాంత పరిరక్షణ కోసం చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా తీర ప్రాంత పర్యావరణం, మానవ ఆవాసాల పరిరక్షించాలని తెలిపారు. ఇక మీదట అటవీ ప్రాంతాల్లో తరచూ పర్యటించి ఫీల్డు అధికారుల సమీక్షలు నిర్వహిస్తానని, వారి సమస్యలు తెలుసుకుంటాను” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Next Story