- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ గొప్ప మనసు.. వారికి ఉచితంగా ఉన్నత విద్య
పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ.5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న పవన్ కల్యాణ్, ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్ నుంచి రూ. 5 వేల సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు.
ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఉత్తమంగా రాణించాలని విద్యార్థులకు శుభాశీస్సులు అందించారు.






